నల్లగొండ టౌన్ : నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్)ను కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడే వెల్‌నెస్ సెంటర్‌ను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యం సక్రమంగా అందుతోందా? అవసరమైన మందులు అందిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని మందులు అందుబాటులో లేవని రోగులు చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి సరఫరా పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న డి–అడిక్షన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్.. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు తగు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం ఎంసీహెచ్ (మాతా శిశు ఆరోగ్య) వార్డును సందర్శించిన కలెక్టర్.. గర్భిణులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ విభాగాన్ని కూడా పరిశీలించి మందుల నిల్వలు, పంపిణీ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్‌తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నరసింహారావు నేత, డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు పాల్గొన్నారు.
ఫ జీజీహెచ్‌లో సేవలపై కలెక్టర్ ఆరా


