కనగల్ : మండల పరిధిలోని చర్లగౌరారం గ్రామంలో శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న బాల పంచాయతీ కార్యక్రమానికి డీజీపీ (ఉమన్ సేఫ్టీ వింగ్) అభిలాష బిస్తు హాజరు కానున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల పిల్లల్లో నాయకత్వ పటిమను పెంచడం, వారి హక్కులపై అవగాహన, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేలా ప్రోత్సహించడం బాల పంచాయతీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి
నల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని శుక్రవారం ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో జీజీహెచ్ ఎదుట వైద్యులు పారామెడికల్ సిబ్బంది నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. జీఓఎంఎస్ నెంబర్ 38, 28 నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ సంఘాల బాధ్యులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవలు మినహా అవుట్ పేషెంట్ సేవలు, ఇతర వైద్య సేవలను బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గ్రామీణ యువతకు ప్రోత్సాహం
నల్లగొండ టూటౌన్ : గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల ప్రతిభను ప్రోత్సహించడానికి అనురాగ్ యూనివర్సిటీ దీర్ఘకాలిక కార్యక్రమం ప్రారంభించినట్లు అనురాగ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ అనురాగ్ పల్లా అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన అనురాగ్ నల్లగొండ నైట్స్ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువ క్రీడాకారులకు కోచింగ్, శిక్షణ సదుపాయం, ప్రాక్టీస్ తదితర అవకాశాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఒక సీజన్‌కే కాకుండా ఐదేళ్ల పాటు కొనసాగిస్తామన్నారు. అనురాగ్ నల్లగొండ నైట్స్ హెడ్ కోచ్ డిబి.రవితేజ మాట్లాడుతూ యువ ఆటగాళ్లకు ఫిట్‌నెస్, నైపుణ్యాల అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జట్టు అసిస్టెంట్ కోచ్ రోనాల్డ్ రోడ్రిగ్స్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ పౌరుల బాధ్యత
రామగిరి(నల్లగొండ) : పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని వృక్షమిత్ర సంస్థ వ్యవస్థాపకుడు, ఆర్టీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవీ.రాఘవేందర్‌రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొండ బస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని విధ్వంసం చేస్తూ తన మనుగడకు తానే ముప్పుగా తయారవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు వృక్షమిత్ర సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జన్మదినం, వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక మొక్క నాటి దానిని వృక్షంగా పెంచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం కె.జానిరెడ్డి, డిప్యూటీ ఆర్‌ఎం సుచరిత, సిబ్బంది శ్రీహరి, నర్సిరెడ్డి, సూపర్‌వైజర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


