నల్లగొండ : మహిళా సంఘాల పొదుపు డబ్బులను బ్యాంక్‌లో కట్టకుండా సొంతానికి వాడుకోవడమే కాకుండా.. ఆ డబ్బుల గురించి నిలదీసిన మహిళలపై బాధ్యులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటన నల్లగొండలోని డీఆర్‌డీఏ కార్యాలయ పరిధిలోని టీటీడీసీ సమావేశ మందిరంలో శుక్రవారం కలకలం రేపింది. బాధితులు కూడా ఎదురుదాడికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం అప్పలమడుగు గ్రామ పరిధిలోని సీత్యా తండాకు చెందిన సోనియాగాంధి మహిళా సంఘం, వెంకటేశ్వర మహిళా సంఘం సభ్యులు 2018లో సీ్త్రనిధి కింద రూ.1.50 లక్షలు, మైక్రో రుణాల కింద ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున రుణం తీసుకున్నారు. మహిళలు ఈ రుణాలను 2022 నాటికే పూర్తిగా చెల్లించారు. కానీ, సీసీ దేవ్‌సింగ్‌నాయక్, వీబీకే భాష్యానాయక్ ఆ డబ్బును బ్యాంకులో కట్టకుండా సొంతానికి వాడుకున్నారు. తీరా చూస్తే.. సోనియాగాంధీ సంఘం పేరుతో రూ.96 వేలు, వెంకటేశ్వర సంఘం పేరుతో రూ.80 వేలు ఇంకా అప్పు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో నిలదీయగా.. ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని సదరు ఉద్యోగులు నమ్మబలికారు.
రెండోసారి కూడా అదే మోసం!
2023లో మిర్యాలగూడ ఎస్‌బీఐ నుంచి ఈ రెండు సంఘాలకు కొత్తగా రూ.10 లక్షల చొప్పున రుణం ఇప్పించారు. ఈ రుణాన్ని కూడా మహిళలు గత ఏప్రిల్ నాటికి పూర్తిగా కట్టేశారు. మళ్లీ కొత్త రుణం కోసం బ్యాంక్‌కు వెళ్లగా.. ఒక సంఘంపై రూ.1.53 లక్షలు, మరో సంఘంపై రూ.2.10 లక్షలు అప్పు ఉన్నట్లు బ్యాంకర్లు చెప్పడంతో మహిళలు షాక్‌కు గురయ్యారు. ఆరు నెలల క్రితం మిర్యాలగూడకు బదిలీ అయిన సీసీ దేవ్‌సింగ్ ఫోన్ ఎత్తకపోవడంతో, బాధితులు శుక్రవారం నల్లగొండ డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డికి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అదే సమయంలో అక్కడ జరుగుతున్న సమావేశంలో సీసీ దేవ్‌సింగ్ ఉన్నాడు. బాధితులు పీడీకి ఫిర్యాదు చేయగా.. ‘మీరు మీరు చూసుకోవాలి’ అంటూ ఆయన బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారని మహిళలు ఆరోపించారు. సమావేశం ముగిశాక సీసీ దేవ్‌సింగ్ బయటకు రాకుండా లోపలే ఉండిపోవడంతో, మహిళలే లోపలికి వెళ్లారు. అక్కడ నుంచి అతను పారిపోయేందుకు ప్రయత్నించగా మహిళలు పట్టుకున్నారు. ఈ క్రమంలో అతని చొక్కొ చిరగడంతో, దేవ్‌సింగ్ మహిళలపై దాడికి దిగాడు. దీంతో మహిళలు కూడా తిరగబడి ఎదురుదాడి చేశారు. అనంతరం దేవ్‌సింగ్‌ను ఒక గదిలో నిర్బంధించి 100కు డయల్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు. కాగా, ఈ విషయమై వివరణ కోరేందుకు డీఆర్‌డీఓను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేదు.
నిరసన తెలుపుతున్న గ్రామస్తులు
ఏపీడీలతో వాగ్వాదం చేస్తున్న అప్పలమడుగు వాసులు,
ఫ మహిళాల సంఘాల డబ్బులను సొంతానికి వాడుకున్న ఉద్యోగులు
ఫ నిలదీసిన మహిళలపై డీఆర్‌డీఓ ముందే దాడి
ఫ ఎదురు దాడి చేసిన మహిళలు
ఫ ఇరు వర్గాలను స్టేషన్‌కు తరలించిన పోలీసులు


