ఎరువులు భారం | - | Sakshi
Sakshi News home page

ఎరువులు భారం

Jun 6 2026 1:41 AM | Updated on Jun 6 2026 1:41 AM

వాతావరణం
మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

- 8లో

భారీగా పెరిగిన ధరలు

ఒక్కో బ్యాగ్‌పై రూ.125 నుంచి రూ.500 వరకు

జిల్లా రైతులపై

రూ.80 కోట్ల అదనపు భారం

నల్లగొండ అగ్రికల్చర్‌ : వానాకాలం సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులపై ఎరువుల ధరల రూపంలో పెద్ద ఎత్తున భారం పడనుంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. ఒక్కో బ్యాగ్‌పై రూ.125 నుంచి రూ.500 వరకు పెరిగింది. ఈ పెంపుతో జిల్లాలో వానాకాలం సీజన్‌లో రైతులపై సుమారు రూ.80 కోట్ల అదనపు భారం ఎరువులపై పడనుంది. యూరియా, డీఏపీ ధరలను ఎరువుల కంపెనీలు పెంచకపోవడం కొంత ఊరట కలిగిస్తోంది.

12,02,051 ఎకరాల్లో సాగు అంచనా..

ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానిలో వరి 5,86,137 ఎకరాల్లో, పత్తి 5,30,524 ఎకరాల్లో, కంది 14 వేల ఎకరాల్లో, ఇతర పంటలు కలిపి మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానికి గాను జిల్లా వ్యాప్తంగా యూరియా 1.61 లక్షల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 33,758 మెట్రిక్‌ టన్నులు, ఎన్‌ఓపీ 12,932 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 1,14,043 మెట్రిక్‌ టన్నులు అవసరంగా గుర్తించి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించింది.

రైతు మహోత్సవ సభకు

8 వేల మంది రైతులు

నల్లగొండ అగ్రికల్చర్‌ : రంగారెడ్డి జిల్లాలోని కోహెడ్‌ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్న రైతు మహోత్సవ సభకు జిల్లా నుంచి 8 వేల మంది రైతులను తరలించడానికి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌, ఉద్యనవన శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కోహెడ్‌ గ్రామంలో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో సుమారు 279 ఎకరాల్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెంగ్‌ సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు అక్కడ జరుగనున్న రైతు మహోత్సవ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ సభకు జిల్లాలోని 33 మండలాల నుంచి సుమారు 8 వేల మంది రైతులను సభకు తరలించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 160 ఆర్టిసీ బస్సులను రైతుల కోసం సిద్ధం చేశారు. ఒక్కో బస్సులు 50 మంది రైతుల చొప్పున సభకు తరలిస్తారు. ఒక్కో బస్సుకు వ్యవసాయ విస్తరణాధికారితో పాటు వ్యవసాయాధికారులను బాధ్యులుగా, పతి 10 బస్సులకు ఒక సమన్వయ అధికారిని నియమించారు. రైతులకు అవసరమైన భోజనం, స్నాక్స్‌, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. బహిరంగ సభ అనంతరం రైతులను సురక్షితంగా వారివారి స్వగ్రామాలకు తరలించడానికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.

50 కేజీల బ్యాగ్‌పై

పెరిగిన ధరలు ఇలా.. (రూ..లలో)

ఎరువు ప్రస్తుతం కొత్తదర

కాంప్లెక్స్‌ 1,900 2,450

ఎంవోపీ 1,850 1,975

ఎస్‌ఎస్‌పీ 615 1,000

Advertisement
 
Advertisement
Advertisement