రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని లతీఫ్ సాబ్, బ్రహ్మం గుట్టల వద్ద జరుగుతున్న ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కొండలను బద్దలు కొట్టేందుకు చేపట్టిన పేలుడు (బ్లాస్టింగ్) తీవ్ర కలకలం రేపింది. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం పేలుడు కారణంగా సమీపంలోని హౌసింగ్ బోర్డు నివాసాలపై శుక్రవారం రాళ్ల వర్షం కురిసింది.పేలుడు దాటికి భారీ రాళ్లు సమీపంలోని ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పలు ఇళ్ల రేకులు, స్లాబ్ తీవ్రంగా దెబ్బతిని లోపల సిమెంట్ పెచ్చులు ఉండిపోయాయి. పేలుడు సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెంది.. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. పేలుడు సమయంలో జనం ఇళ్ల బయట ఉంటే ప్రాణనష్టం జరిగేదని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం, పాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జనావాసాలకు ఇంత దగ్గరగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు తగిన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటను పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఫ ఇళ్లపై పడ్డ భారీ రాళ్లు
ఫ దెబ్బతిన్న ఇళ్ల స్లాబ్‌లు, రేకులు


