రామగిరి(నల్లగొండ) : బాలభవన్ నల్లగొండ, నాగార్జునసాగర్ సంయుక్త ఆధ్వర్యంలో 40 రోజులుగా నిర్వహించిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు డీఈఓ సుశీందర్‌రావు హాజరై మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు, అనవసర వ్యాపకాలకు బానిసలు కాకుండా వేసవి శిబిరాల్లో పాల్గొనడం చాలా సంతోషించదగ్గ పరిణామం అన్నారు. పిల్లలను ఈ శిబిరానికి పంపించి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు సహకరించిన తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు వసంతకుమారి, రాజేశ్వరి, విశ్వజ్యోతి విద్యార్థినులు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న విద్యార్థుల సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు పాలబిందెల బాలు, ఇన్‌స్ట్రక్టర్స్ ఉపేంద్రాచారి, ఫజల్‌బేగం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


