కార్యాలయాల్లో సందడి
ఫ కమర్షియల్ విభాగంలో ప్రకాశంబజార్‌లో రూ.40వేలకు పెంపు
ఫ స్లమ్ ఏరియాల్లో రూ.4800కు పెంపు
ఫ పెరిగిన ధరలు నేటి నుంచి అమలు
నల్లగొండ: భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది. మార్కెట్ విలువలను సవరిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదించిన కొత్త ధరలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమలులోకి రానున్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రతి ఏటా మార్కెట్ విలువల సవరణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. గత మూడేళ్లుగా ధరలను పెంచలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ఒకేసారి కనిష్టంగా 50 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కొనుగోలుదారులపై పెనుభారం పడనుండగా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది.
కమర్షియల్ విభాగంలో..
నల్లగొండ పట్టణంలోని ప్రకాశంబజార్‌లో ప్రస్తుతం మార్కెట్ విలువ గజం రూ.27,100 ఉండగా రూ.40వేలకు పెంచారు. మిర్యాలగూడ రోడ్డులో రూ.4100 ఉన్న విలువ రూ.6 వేలకు, హైదరాబాద్ రోడ్డులోని వెంకటేశ్వరకాలనీలో రూ. 10,800 ఉండగా రూ.16,200కు పెరిగింది. హైదరాబాద్ రోడ్డులో ని మెయిన్ రోడ్డు లోపల వైపు ప్రస్తుతం రూ.4800 ఉండగా రూ.7200కు పెంచారు. క్లాక్‌టవర్ నుంచి రామగిరి వైపు ప్రస్తుతం రూ. 17,600 ఉన్న మార్కెట్ విలువ రూ.26 వేలకు పెంచారు. మిర్యాలగూడ రోడ్డు వెంట రూ.17,600 ఉండగా రూ.26 వేలకు, దేవరకొండ మెయిన్ రోడ్డులో రూ.5,800 ఉండగా ఏకంగా రూ.10 వేలకు పెరిగింది.
రెసిడెన్షియల్ విభాగంలో..
రూ.1700 ఉన్న చోట 2600కు, రూ.2400 ఉన్న దగ్గర రూ.4200కు పెంచారు. బొట్టుగూడ స్లమ్ ఏరియాలో రూ.2400 ఉండగా రూ.4800కు, చర్లపల్లిలో రూ.3,100 ఉండగా రూ.5,425కు, గ్రామీణ ప్రాంతాల్లో గజం రూ.500 ఉండగా దానిని రూ.900కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. గురువారం వరకు పాత భూ విలువలు అమలులో ఉండడం, శుక్రవారం నుంచి కొత్త ధరలు అమలులోకి రానుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కొనుగోలు అమ్మకందారులతో సందడిగా మారాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రాత్రి 8గంటల వరకు కొనసాగింది. మున్సిపాలిటీలు, హైవేల వెంట కార్యాలయాలు ఉన్న చోట రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి.


