నీలగిరిలో సిటీ బస్సులు నడిపేందుకు ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

నీలగిరిలో సిటీ బస్సులు నడిపేందుకు ప్రణాళిక

Jun 5 2026 4:41 AM | Updated on Jun 5 2026 4:41 AM

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

రామగిరి(నల్లగొండ): రామగిరి(నల్లగొండ): జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను గురువారం తెలంగాణ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగిరెడ్డి సందర్శించారు. బస్టాండ్‌ ప్రాంగణం, గ్యారేజ్‌, ప్రయాణికుల రద్దీ ప్రాంతాలు, డిపో పరిధిలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లను పరిశీలించారు. గ్యారేజ్‌ ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. అనంతరం రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయంలో మేయర్‌ బుర్రి చైతన్యరెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి నాగిరెడ్డి ఉన్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో, ఏ రూట్లలో లాభాలు వస్తున్నాయి, ఎక్కడ నష్టాలు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్‌ బస్సుల వాటి పనితీరు, చార్జింగ్‌ మౌలిక వసతులు, ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనపై చర్చించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి, విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఎండీ స్పష్టం చేశారు. నగర ప్రజలు, విద్యార్థుల అంతర్గత రవాణా అవసరాలను తీర్చడానికి నగరంలోని అన్ని శివారు ప్రాంతాలు, కాలనీలను అనుసంధానిస్తూ సిటీ బస్సులు ముమ్మరంగా నడపాలని ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల వద్ద ఆధునిక బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ స్థలంలో ఒక భారీ బహుళ అంతస్తుల షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖుస్రో షా ఖాన్‌, రీజనల్‌ మేనేజర్‌ కొణతం జానిరెడ్డి, నల్లగొండ మేయర్‌ బుర్రి చైతన్యరెడ్డి, డిపో మేనేజర్‌, ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు..

మిర్యాలగూడ టౌన్‌ : ప్రతి డిపో పరిధిలోని గ్రామానికి పల్లె వెలుగు బస్సులు నడిపించాలనేదే ఆర్టీసీ లక్ష్యమని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగిరెడ్డి తెలిపారు. గురువారం మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌ను హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖుస్రో షా ఖాన్‌తో కలిసి సందర్శించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ డీఎం చాంబర్స్‌లో ఆర్టీసీ బస్టాండ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. డిపోలకు 60 కిలోమీటర్ల దూరం ఉంటే పల్లె వెలుగు బస్సులు కాకుండా ఎక్కువ శాతం ఎక్స్‌ప్రెస్‌లు నడిచే విధంగా చూడాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అన్ని డిపోల్లో అధిక ఆదాయం వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునీకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరడంతో ఈ విషయంపై పరిశీలిస్తామని తెలిపారు. ఆయన వెంట నల్లగొండ రీజినల్‌ మేనేజర్‌ కొణతం జాన్‌రెడ్డి, మిర్యాలగూడ డిపో మేనేజర్‌ రాంమోహన్‌రెడ్డి, మిర్యాలగూడ డీఎస్‌పీ రాజశేఖర్‌రాజు, భార తీ బాయి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement