మొరాయిస్తున్న రెవెన్యూ సర్వర్‌ | - | Sakshi
Sakshi News home page

మొరాయిస్తున్న రెవెన్యూ సర్వర్‌

Jun 5 2026 4:41 AM | Updated on Jun 5 2026 4:41 AM

నల్లగొండ టూటౌన్‌ : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా జిల్లాలోని మున్సిపాలిటీలు, నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఆస్తి పన్ను సర్వర్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. యాప్‌ అప్‌డేట్‌ కారణంగా గత ఐదు రోజులుగా రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలు స్తంభించిపోయాయి. ఫలితంగా జిల్లా కేంద్రమైన నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్‌ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న జనం

సర్వర్‌ పని చేయకపోవడంతో స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, నల్లా బిల్లులు కట్టుకోవడానికి ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. గత ఐదు రోజులుగా భవన యజమానులు, సాధారణ పౌరులు తమ పన్నులు చెల్లించేందుకు మున్సిపల్‌ కార్యాలయాలకు, వార్డు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, పైనుంచే సర్వర్‌ రావడం లేదంటూ అధికారులు చేతులెత్తేయడంతో సామాన్యులు వెనుతిరగాల్సి వస్తోంది.

సీడీఎంఏ కార్యాలయంలోనే తరచూ సమస్య

హైదరాబాద్‌లోని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఆన్‌లైన్‌ వ్యవస్థ నియంత్రించబడుతుంది. అక్కడ సర్వర్‌ సమస్య వస్తే అన్ని కార్యాలయాల్లో సేవలు నిలిచిపోతాయి. గత నెలలో కూడా 15 రోజుల పాటు సర్వర్‌ సమస్య వచ్చింది. ఇంత జరుగుతున్నా ప్రధాన కార్యాలయం నుంచి సకాలంలో స్పందన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వర్‌ ఎప్పుడు వస్తుందనే సమాచారం మున్సిపాలిటీలకు ఇవ్వకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సర్వర్‌ సమస్య కారణంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్‌లకు నెల వారీగా వచ్చే ఆదాయం రాకుండా పోతుంది. ఆస్తి పన్ను సర్వర్‌ పని చేయకపోతే ఒక్క రోజులోనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ ప్రభావం ఆస్తి పన్ను, నల్లా బిల్లుల వసూళ్లపై పడే అవకాశం ఉంటుంది. దీనిపై మున్సిపల్‌ అధికారులు స్పందిస్తూ ఒకటి, రెండు రోజుల్లో సర్వర్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు.

ఫ ఐదు రోజులుగా నిలిచిన సేవలు

ఫ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ఆగిన ఆస్తిపన్ను వసూళ్లు

Advertisement
 
Advertisement
Advertisement