అండగా ‘ఆరోగ్య మహిళ’
మందులు కూడా అందిస్తున్నాం
నల్లగొండ టౌన్ : మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 11 కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు ఉచితంగా ప్రత్యేక వైద్యపరీక్షలు చేస్తూ వ్యాధులను ముందుగా గుర్తించి మందులు అందజేస్తున్నారు. మహిళలకు వచ్చే జబ్బులను ముందుగానే గుర్తించడం ద్వారా వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఆరోగ్య మహిళా పథకాన్ని 2023 మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 1.24 లక్షల మంది మహిళలకు పరీక్షలు చేశారు. మహిళలు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించుకోని కారణంగా అనేకమంది రక్తహీనత, ఇతర వ్యాధుల బారినపడి మరణిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మహిళలకు ముందస్తుగా వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను గుర్తించి సరైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు.
ఏయే పరీక్షలు చేస్తున్నారంటే..
క్యాన్సర్, రక్తహీనత, రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, కుటుంబ నియంత్రణ, ఉబకాయం, బీపీ, షుగర్, రుతుక్రమం తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ఎవరైనా వ్యాధులబారిన పడినట్లు అనుమానం ఉంటే వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేసి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఉచితంగా పరీక్షలు చేయించి మందులు అందజేస్తున్నారు.
ఆరోగ్య కేంద్రాలు ఎక్కడెక్కడంటే..
నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క, డిండి, నిడమనూరు, వేములపల్లి, కట్టంగూర్, మర్రిగూడ, తిప్పర్తి, చండూరు, చింతపల్లి, శాలిగౌరారం, దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. స్పెషలిస్టు మహిళా డాక్టర్లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రతి మంగళవారం ఆయా ఆరోగ్య కేంద్రాల వద్ద మహిళలు బారులుదీరి వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారు. ఫలితంగా ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది
ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తూ మందులు కూడా అందిస్తున్నాం. మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
ఫ రెండున్నరేళ్లుగా 1.24 లక్షల మంది మహిళలకు వైద్యపరీక్షలు
ఫ అన్నిరకాల వ్యాధులకు ఉచితంగా మందులు
ఫ వ్యాధి నిర్ధారణ అయితే జీజీహెచ్‌కు రెఫర్
ఫ జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలు


