ఎన్జీ కాలేజీలో నేడు మెగా జాబ్ మేళా
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీలో టీఎస్‌కేసీ, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో న్యూ ల్యాండ్ ల్యాబోరేటరీ లిమిటెడ్, హానర్ ల్యాబ్ లిమిటెడ్ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. 2021 నుంచి 2025 మధ్య బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
కేతేపల్లి : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. కేతేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులు, సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వల రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, వైద్యాధికారిణి అర్చన, ఆయుర్వేద వైద్యాధికారి నేహా, సిబ్బంది ఉన్నారు.
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా యాదగిరికొండపై ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో బిల్వార్చన, రుద్రాభిషేకం, ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి అభిషేకం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రధానాలయంలో..
సోమవారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ఆరాధనలు చేశారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి చేసి, గజవాహనసేవ.. స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన , సాయంత్రం వెండిజోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు.
ఎన్జీ కాలేజీలో నేడు మెగా జాబ్ మేళా


