పొదుపు సంఘాలకు అందని వడ్డీ!
విడుదల కాగానే జమ చేస్తాం
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లోని మహిళా పొదుపు సంఘాలకు ప్రభుత్వాలు వడ్డీ డబ్బులు విడుదల చేయడం లేదు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, నందికొండ, చండూరు, నకిరేకల్, హాలియా మున్సిపాలిటీల్లో 6,575 పొదుపు సంఘాలకు మెప్మా కార్యాలయ అధికారిక లెక్కల ప్రకారం 2019–20 నుంచి 2022–23 సంవత్సరం వరకు రూ.8.82 కోట్ల వడ్డీ బకాయిలు రావాల్సి ఉన్నా నేటికీ అందించడం లేదు. 2024–25 ఆర్థిక సంవత్సరానిది కూడా కలుపుకుంటే వడ్డీ దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉంది. అయితే వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియక ఐదేళ్లుగా మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామీణ సంఘాలకే వడ్డీ..
గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలకు వడ్డీ విడుదల చేస్తున్న ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలకు మాత్రం వడ్డీ విడుదల చేయడంలేదు. ఐదేళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ డబ్బులను విడుదల చేయలేదు. వడ్డీలేని రుణం (వీఎల్‌ఆర్) ఇస్తున్నామని చెబుతున్నారే తప్ప బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీని తిరిగి ఇవ్వడంలో ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయి.
కొత్త సంఘాల ఏర్పాటుపై వడ్డీ ఎఫెక్ట్
మెప్మా ఆధ్వర్యంలోని ప్రతి సంవత్సరం కొత్తగా మహిళా సంఘాలను సిబ్బంది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సంఘం ఏర్పాటు చేయాలంటే 10 మంది మహిళలు ఉండాలి. ఒక్కో మహిళ వంద రూపాయలు చొప్పున బ్యాంకులో పొదుపు చేసిన తరువాత ఆరు నెలలకు రుణం ఇస్తారు. కానీ నాలుగేళ్లుగా పొదుపు సంఘాలకు ప్రభుత్వాలు వడ్డీ విడుదల చేయకపోవడంతో కొత్త సంఘాల ఏర్పాటుపై ప్రభావం పడుతుంది. కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు ప్రతినెలా 10వ తేదీలోగా చెల్లించకపోతే తమకు అధిక వడ్డీ పడుతుందనే ఆలోచనతో ముందుకు రావడంలేదని మెప్మా సిబ్బంది చెబుతున్నారు.
బకాయిలు వచ్చేనా..
జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లోని పొదుపు సంఘాలకు రావాల్సిన వడ్డీ బకాయిల డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. వడ్డీ డబ్బుల కోసం మహిళలు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పలువురు మహిళలు ఆయా పట్టణాల్లోని మున్సిపల్ కార్యాలయాల్లో మెప్మా సిబ్బందిని వడ్డీ గురించి ఆరా తీస్తున్నా వారి వద్ద కూడా ఎలాంటి సమాచారం ఉండడంలేదు. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి తమకు రావాల్సిన వడ్డీ డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని పట్టణ ప్రాంత మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.
పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం నుంచి వడ్డీ డబ్బులు చేయగానే వారి ఖాతాల్లో జమ చేస్తాం. త్వరలోనే వడ్డీ డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రతినెలా సమయానికి రుణం డబ్బులు చెల్లించే అన్ని సంఘాలకు వడ్డీ రానుంది.
– శివాజీ, మెప్మా ఇన్‌చార్జి, నల్లగొండ
ఫ ఐదేళ్లుగా విడుదల చేయని ప్రభుత్వాలు
ఫ జిల్లా వ్యాప్తంగా రూ.8.82 కోట్ల బకాయి
ఫ ఎదురుచూస్తున్న పట్టణ ప్రాంత మహిళలు


