రేపు ఉమ్మడి జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికల బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు ఈ నెల 3న నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 కార్యదర్శి కుంభం నర్సిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, 10వ తరగతి మెమో తీసుకొని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ : 8096745465 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కిడ్నాప్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి
నల్లగొండ టూటౌన్ : తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి భర్త యాదగిరిని కిడ్నాప్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోమవారం నల్లగొండలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మందడి సైదిరెడ్డి, జమాల్ ఖాద్రి, చొల్లేటి ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
కేజీబీవీ ఎస్‌ఓ విధుల
నుంచి తొలగింపు
మునుగోడు : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించినందుకు మునుగోడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రత్యేకాధికారి పుష్పలతను సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి విధుల నుంచి పూర్తిగా తొలగించారు. ఆ పాఠశాలల్లో ఇంటర్ విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థిని 30 రోజులపాటు సెలవు పెట్టి తమ ఇంటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం ఆ విద్యార్థిని తల్లితండ్రులు తిరిగి పాఠశాలల్లో చేర్పించారు. అయితే ఆదివారం సాయంత్రం అందరితోపాటు భోజనం చేసిన అనంతరం ఆ విద్యార్థిని తన బ్యాగు సర్దుకుని తక్కువ ఎత్తులో ఉన్న ప్రహరీ పైనుంచి దూకి వెళ్లిపోయింది. ఇది గమనించిన నైట్ డ్యూటీలో ఉన్న టీచర్లు స్థానిక పోలీసులకు సమచారం ఇవ్వగా వెంటనే చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న డీఈఓ భిక్షపతి పాఠశాలలో విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు పంపారు. అయితే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఓను ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు డ్యూటీలో ఉన్న టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
యాదగిరీశుడికి
లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల ను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వైజ్రవైఢూర్యాలు, వివిధ పుష్పమాలికలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు.. ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సహస్రనామ పఠనాలు పఠిస్తూ లక్ష పుష్పార్చన నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం తదితర పర్వాలను పాంచారాత్రగమశాస్త్ర రీతిలో చేపట్టారు. అదే విధంగా శివాలయంలో సంప్రదాయ పూజలు చేపట్టారు.


