సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
దేవరకొండ : దేవరకొండ పట్టణంలోని వివిధ వార్డుల్లో ఈనెల 6వ తేదీన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతోపాటు శంకుస్థాపనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై పలు విషయాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న పనులు, హెలిపాడ్, బహిరంగ సభ స్థలం తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎన్నికల నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని సూచించారు. అనంతర ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, ఎంకేఆర్ డిగ్రీ కళాశాలల పరిసరాలను పరిశీలించారు. వారి వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, కమిషనర్ సుదర్శన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.


