స్టోన్ క్రషర్స్ యజమానుల సమ్మెబాట
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో స్టోన్ క్రషర్ మిల్లులు నడపటం కష్టసాధ్యంగా మారిందని వాటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లాలోని స్టోన్ క్రషర్స్ మిల్లులను బంద్ పెట్టిన వాటి యజమానులు సమ్మెబాట పట్టారు.
నిబంధనలు ఇవీ..
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం వల్ల స్టోన్ క్రషర్ యూనిట్‌లో విద్యుత్ వినియోగం ఆధారంగా ఇటు ఖనిజ వినియోగ నిష్పత్తి అంచనా వేస్తున్నారు. ప్రతి టన్నుకు ముడి ఖనిజం ఉత్పత్తికి 4 కేవీఏహెచ్ విద్యుత్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ వినియోగ సమాచారం విద్యుత్ సంస్థలోని పోర్టల్‌కు లింకవుతుంది. డీజిల్ జనరేటర్ ద్వారా విద్యుత్ వినియోగిస్తే దానికి కూడా మీటర్ ఏర్పాటు చేయాలి. ఇలా క్వారీల్లో వినియోగించిన యూనిట్లను లెక్కగట్టి దాని ఆధారంగా పన్ను వసూలు చేస్తారు. దీంతో క్రషర్ మిల్లులపై భారం పడనుంది. క్రషర్ మిల్లుల్లో కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి అన్నీ ఆన్‌లైన్‌లోనే అనుమతులు తీసుకోవాలి. క్వారీల్లో సీసీ కెమెరాలు, వే బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలి. కెమెరాలను ఏడీ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటారు. క్రషర్‌లో రాయి తూకం ఆటోమెటిక్‌గా కంప్యూటర్ సిస్టమ్‌లో రికార్డు అవుతుంది. దీని ద్వారా ఎంత ఖనిజం అమ్ముతున్నారు. ఎంత ఉత్పత్తి అవుతుందనే లెక్కలు తేలిపోతాయి. గతంలో క్రషర్ యూనిట్ల వద్ద ఎంత ముడిసరుకు వినియోగించారనేది తెలిసేది కాదు. అయితే కొత్త నిబంధనలతో క్రషర్లు నడిపేలా లేమని వ్యాపారులు వాపోతున్నారు.
ప్రభుత్వానికి విన్నవించినా..
ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 24 స్టోన్ క్రషర్ మిల్లులు యజమానులు సోమవారం నుంచి సమ్మెబాట పట్టారు.
ఫ కొత్త నిబంధనలతో మిల్లులు
నడపలేమంటూ ఆవేదన
ఫ సడలింపు ఇవ్వాలని మిల్లుల బంద్


