
ప్రభుత్వ పథకాల్లో పురోగతి తేవాలి
నల్లగొండ : ప్రభుత్వ పథకాల్లో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీఓలు పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధుల నియంత్రణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్కూల్ టాయిలెట్లు, ఇతర పనులకు సంబంధించి అంచనాలను నిర్దేశించిన సమయంలో సమర్పించాలని సూచించారు. ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలో మొక్కలు నాటాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో.. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఇచ్చేందుకు అంచనాలు రూపొందించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన తోటల పెంపకంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన 3 వేల ఎకరాల లక్ష్యానికి 1,237 ఎకరాలు మాత్రమే పూర్తి చేసారని, మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు , గృహ నిర్మాణ ిపీడీ రాజ్‌కుమార్, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
నార్కట్‌పల్లి : భూ భారతి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను మూడు రకాలుగా విభజించి పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె నార్కట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి, రేషన్‌కార్డుల దరఖాస్తుల పురోగతిపై తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావును అడిగి తెలుసుకున్నారు.
మీ సేవ కేంద్రం తనిఖీ
నార్కట్‌పల్లిలోని మీసేవ కేంద్రానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయంగా వెళ్లి ధ్రువీకరణపత్రాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే ఫీజులు తీసుకోవాలని మీ సేవ ఆపరేటర్‌కు సూచించారు. అనంతరం పాఠశాలకు వెళ్లి విద్యార్థుల చదువు, సౌకర్యాలను పరిశీలించారు. ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డీఈఓ భిక్షపతి, డీఎస్‌ఓ వెంకటేశం, మత్స్య శాఖ ఏడీ చరిత ఉన్నారు.
తాగునీటి వసతి కల్పించాలి
రామగిరి(నల్లగొండ) : మండలంలోని ముషంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో.. వెంటనే వాటర్ ట్యాంకు నుంచి కనెక్షన్ ఇప్పించి టాప్‌లు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి.. వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ అరుంధతి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రభుత్వ పథకాల్లో పురోగతి తేవాలి