యాసంగికి సాగునీరందేనా ! | Sakshi
Sakshi News home page

యాసంగికి సాగునీరందేనా !

Published Sun, Dec 3 2023 1:30 AM

10 అడుగుల నీటిమట్టంతో ఉన్న 
శాలిగౌరారం ప్రాజెక్టు - Sakshi

శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం రూ.5.50కోట్లు నిధులు మంజూరు చేసింసింది. పనులు ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా పనులు అంతంత మాత్రమే జరిగాయి. ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చే రాచకాల్వ అభివృద్ధి పనులు జరగకపోవడంతో మూసీ నది నుంచి వచ్చే వరద నీరు రాకుండా పోయింది. ఫలితంగా ప్రాజెక్టులో నీటిమట్టం కనిష్టానికి పడిపోయింది. ప్రాజెక్టు ఆయకట్టులో యాసంగి పంటసాగుకు సాగునీరందే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సంవత్సరం వానాకాలంలోనే పంట సాగుకు సకాలంలో నీరందించలేదని, యాసంగికి ఆలస్యమైనా సరే సాగునీరందే అవకాశం కనిపించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 21 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో ప్రస్తుతం 10 అడుగుల నీటిమట్టం కలిగి ఉంది.

అక్రమంగా విద్యుత్‌ మోటార్లు

30 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రాజెక్టు రాచకాల్వపై వందల సంఖ్యలో ఉన్న విద్యుత్‌ మోటార్లు నీటిని తోడేస్తుండటంతో రాచకాల్వలో వరదనీరు ప్రవహించడం అసాధ్యంగా మారుతోంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టులో ఉన్న నీటిని ప్రాజెక్టు ఆవరణలో ఏర్పాటు చేసిన బావుల ద్వారా ఎగువ భాగానికి తరలిస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు కనిష్టానికి పడిపోతుంది.

1200 ఎకరాల విస్తీర్ణం..

శాలిగౌరారం ప్రాజెక్టు 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటిసామర్థ్యంతో 5వేల ఎకరాల ఆయకట్టును కలిగి ఉంది. ప్రాజెక్టు పరిధిలో శాలిగౌరారం, తిరుమలరాయునిగూడెం, రామగిరి, శాలిలింగోటం, అంబారిపేట, గురుజాల, అడ్లూరు, ఊట్కూరు, బండమీదిగూడెం గ్రామాల్లోని 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం యాసంగి పంటకు సాగునీరందాలంటే ప్రాజెక్టులో కనీసం 15 అడుగుల నీటి నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరువచ్చే రాచకాల్వలో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే మూసీ నదిలో ప్రవహించే వరదనీటిని ప్రాజెక్టులోకి మళ్లిస్తే ప్రాజెక్టు యాసంగికి సాగునీరందే ఆశలు సజీవంగా ఉంటాయి.

సగానికి పైగా పడిపోయిన శాలిగౌరారం ప్రాజెక్టు నీటిమట్టం

వరినార్లకు దాటిపోతున్న అదును

అయోమయంలో అన్నదాతలు

పట్టించుకునేవారే లేరు

మూసీ నది ద్వారా ప్రాజెక్టులోకి నీరువచ్చి చేరే విషయాన్ని పట్టించుకున్ననాథుడే లేడు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతోనే సాగునీటి కష్టాలు వచ్చాయి. వర్షాల వల్ల వానాకాలంలో పంటలకు సరిపడా నీరందింది. ఇప్పుడు యాసంగికి ప్రాజెక్టులో సరిపడా నీరునిల్వ లేకపోవడంతో యాసంగి పంటను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ముందుముందు రైతులు పంటలు పండించుకోవడం కష్టమే.

– చింత ధనుంజయ్య, రైతు, శాలిగౌరారం

త్వరలో నీరు విడుదల చేస్తాం

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం 10 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి నీరువచ్చే రాచకాల్వలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. మరో వారం రోజుల్లో పూడికతీత పనులు పూర్తిచేసి మూసీనది నుంచి వరద నీటిని ప్రాజెక్టులోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాసంగి పంటసాగుకు సరిపడా నీటి నిల్వ చేరగానే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – రాములు,

ఇరిగేషన్‌ ఏఈ, శాలిగౌరారం ప్రాజెక్టు

1/2

2/2

Advertisement
 
Advertisement