20 మండలాల్లో వర్షం | Sakshi
Sakshi News home page

20 మండలాల్లో వర్షం

Published Fri, Nov 24 2023 2:04 AM

బి.వెల్లంలలో పోలింగ్‌ సిబ్బందికి సూచనలిస్తున్న విజయ్‌సింగ్‌ మీనన్‌ 
 - Sakshi

నల్లగొండ టౌన్‌: అల్పపీడన ద్రోణి కారణంగా గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. 3.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దామరచర్ల మండలంలో 27.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే త్రిపురారం మండలంలో 14.9, నార్కట్‌పల్లిలో 9.1, నల్లగొండ 8.3, కట్టంగూర్‌ 8.3, తిప్పర్తి 6.8, మిర్యాలగూడ 5.3 వర్షం కురిసింది. మునుగోడు 3.4, చిట్యాల 3.1, మాడుగులపల్లి 2.9, నిడమనూరు 2.6, కనగల్‌ 2.3, నకిరేకల్‌ 1.7, వేములపల్లి 1.1, పీఏపల్లి 0.5, అడవిదేవులపల్లి 0.3, కేతేపల్లి 0.3, పెద్దవూర 0.3, దేవరకొండ 0.3, అనుముల హాలియా 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

నార్కట్‌పల్లి: ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి మద్యం, నగదు రవాణా కాకుండా చెక్‌పోస్టులతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల పోలీస్‌ జనరల్‌ అబ్జర్వర్‌ విజయ్‌సింగ్‌ మీనన్‌ తెలిపారు. గురువారం ఆయన నార్కట్‌పల్లి మండలం బి.వెల్లంల, కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని అడిగి ఆయా కేంద్రాల గురించి తెలుసుకొని పలు సూచనలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సరైన ప్రణాళిక రూపొందించాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట స్థానిక సీఐ మహే్‌ష్‌, ఎస్‌ఐ సైదబాబు ఉన్నారు.

నేడు సూర్యాపేట మార్కెట్‌కు సెలవు

భానుపురి (సూర్యాపేట): వర్షం వచ్చే అవకాశం ఉండడంతో పాటు మార్కెట్‌ యార్డ్‌కు అధిక మొత్తంలో ధాన్యం వచ్చినందున ఎగుమతుల దృష్ట్యా శుక్రవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించినట్లు మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎండీ ఫసియుద్దీన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం యార్డుకు సరుకులను తీసుకొచ్చే రైతులకు శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

వైభవంగా ‘మత్స్యగిరి’ బ్రహ్మోత్సవాలు

వలిగొండ. : మండలంలోని వెంకటాపురంలో గల మత్స్యగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆల య వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, పారాయణం, శ్రీవిశ్వక్సేన ఆరాధన, పుణ్యావాహచనం, యాగశాల ప్రవేశం, చతుస్నానార్చన, అగ్నిప్రతిష్ఠ, ద్వారతోరణం, ధ్వజకుంభ ఆరాధన, నిత్య హోమాలు, పూర్ణాహుతి, ధ్వజారోహణం, బలిహరణం, నివేదన, తీర్థ ప్రసాదగోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల కోసం వస్తే నిలదీయాలి

సూర్యాపేటటౌన్‌: ఏనాడు ప్రజా సమస్యలపై పట్టించుకోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వేళ హామీలు ప్రకటిస్తున్నాయని, ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను సమస్యలపై నిలదీయాలని పీడీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం గత పాలనలో చేసిన అవినీతి, అక్రమాలన్నింటినీ మరిచి నిజాయితీపరులుగా ఓట్ల కోసం ప్రజల దగ్గరికి రావడం సిగ్గు చేటన్నారు. రాజకీయ నాయకులు హామీలతో ప్రజలను మరోసారి మోసగిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సంఘం నాయకులు అంజద్‌, అశోక్‌, కార్తీక్‌, ప్రశాంత్‌, మధు పాల్గొన్నారు.

ఉత్సవమూర్తులకు పూజలు
నిర్వహిస్తున్న వేదపండితులు
1/1

ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement