గుత్తా సుఖేందర్‌రెడ్డి వాహనం తనిఖీ | Sakshi
Sakshi News home page

గుత్తా సుఖేందర్‌రెడ్డి వాహనం తనిఖీ

Published Wed, Nov 15 2023 1:34 AM

-

రామగిరి(నల్లగొండ): శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వాహానాన్ని మంగళవారం తిప్పర్తి వద్ద ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. మిర్యాలగూడలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరై తిరిగి నల్లగొండకు వస్తుండగా తిప్పర్తి వద్ద సుఖేందర్‌రెడ్డి కాన్వాయ్‌ని ఎన్నికల అధికారులు ఆపి ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. మండలి చైర్మన్‌ తనిఖీలకు పూర్తిగా సహకరించారు.

మహిళతో అసభ్యకర ప్రవర్తన

నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా

అడ్డగూడూరు : మహిళతో అసభ్యకర్తంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ రామన్నపేట కోర్టు జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు. అడ్డగూడూరు ఎస్‌ఐ నాగరాజు కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన జగాటి సైదులు 2014వ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె ఒంటరిగా ఉండగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ సైదులుపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నేరం నిరూపణ కావడంతో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారని ఎస్‌ఐ వివరించారు.

రూ.2లక్షల విలువైన బొట్టుబిల్లలు స్వాధీనం

రామన్నపేట : ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్న రూ. 2లక్షల విలువైన బొట్టు బిల్లలను రామన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేట శివారులో ఏర్పాటు చేసిన అంతర్‌జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో భువనగిరి వైపు నుంచి మిర్యాలగూడకు ఆటోలో తరలిస్తున్న బొట్టుబిల్లలతో కూడిన 10కాటన్ల కరపత్రాలను పోలీసులు గుర్తించారు. బొట్టుబిల్లలను స్వాధీనం చేసుకొని, ఆటోను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. ఆ కాటన్లలో మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఫొటోతో కరపత్రాలు ముద్రించిన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement