తపాలశాఖలో కలవరం! | - | Sakshi
Sakshi News home page

తపాలశాఖలో కలవరం!

May 23 2026 12:40 AM | Updated on May 23 2026 12:40 AM

అసలు సమస్య ఇక్కడే.. బదిలీ అయ్యారు..

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పోస్టల్‌ సూపరింటెండెంట్‌ భూమన్న పేరు

బదిలీ వేటు వేసి పోస్టింగ్‌ ఇవ్వని ఉన్నతాధికారులు

పూర్తి వివరాలు సేకరిస్తున్న సీబీఐ అధికారులు

బిల్లుల చెల్లింపులపై

సృష్టత కరువు

వనపర్తిటౌన్‌: బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్‌ సేవక్‌ల అదనపు బిల్లుల చెల్లింపు కోసం పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌ లంచం ఆశిస్తూ ఈ నెల 8న సీబీఐకి పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. ఈ వ్యవహారంలో పోస్టల్‌ సూపరింటెండెంట్‌ భూమన్న పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని భూమన్న ఖండించినప్పటికీ.. అనూహ్యంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో అతడి పేరు నమోదు కావడంతో తపాలశాఖలో కలవరం మొదలైంది. భూమన్నను వనపర్తి నుంచి బదిలీ చేసిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. రెండ్రోజుల కిందట సీబీఐ అధికారులు భూమన్న, పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వనపర్తి ప్రధాన పోస్టల్‌ కార్యాలయం నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో పోస్టల్‌ సూపరింటెండెంట్‌ పేరు నమోదు కావడంతో సీబీఐ విచారణ ఎవరెవరికి తలనొప్పి తెచ్చిపెడుతుందోనని సిబ్బందిలో కలవరం మొదలైంది. భూమన్న ఎక్కడెక్కడ విధులు నిర్వర్తించారు.. ఆయన వ్యవహారం శైలిపై సీబీఐ దృష్టి సారించినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు.

ఇక్కడ విధులు నిర్వర్తించే పోస్టల్‌ సూపరింటెండెంట్‌ భూమన్న బదిలీ కావడంతో ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల కిందటే బాధ్యతలు తీసుకోవడంతో అదనపు విధుల బిల్లుల చెల్లింపు సమాచారం తీసుకోలేదు. పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతాం.

– ఎన్‌.వెంకటేశ్వర్‌, ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌, వనపర్తి

వనపర్తి తపాల ప్రధాన కార్యాలయంలో అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగుల బిల్లుల చెల్లింపుల జాప్యం సీబీఐ వరకు చేరింది. 2023 నుంచి 2026 వరకు బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్‌సేవక్‌లు లేని శాఖల్లో ఉన్న సిబ్బంది అదనపు బాధ్యతలు నిర్వర్తించేలా తపాలాశాఖ చర్యలు చేపట్టింది. వీరికి రెగ్యులర్‌ వేతనంతో పాటు అదనపు విధులకు సంబంధించిన బిల్లులను తపాలాశాఖ చెల్లిస్తుంది. అదనపు విధులు నిర్వర్తించిన సుమారు 192 మంది ఉద్యోగుల బిల్లులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో గతేడాది చివరిలో బిల్లులు చెల్లింపునకుగాను పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఉన్నతాధికారులకు దస్త్రం సమర్పించారు. ఇందుకు అనుమతిస్తున్నట్లు ప్రతి దస్త్రం అందజేసిన నాలుగు నెలల తర్వాత నిలిపివేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ దశలోనే అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగులు లంచం ఇస్తే ఎలాగైనా బిల్లులు జారీ చేస్తామని పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ పట్టుబట్టడంతో ఓ బీపీఎం సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఈ నెల 8న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోస్టల్‌ సూపరింటెండెంట్‌ పేరు కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు కావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. బిల్లుల చెల్లింపుతో రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వచ్చే ఉద్యోగులు ఉన్నారు. సుమారు రూ.10 లక్షల వరకు బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి ఆమోదం తెలిపారా? లేక తిరస్కరించారా అనేది బయటడటం లేదు. కొందరు అధికారులు మాత్రం బిల్లుల చెల్లింపు ప్రక్రియ చేపట్టినట్లు చెబుతున్నా అధికారికంగా ధ్రువీకరించేందుకు ఇష్టపడటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement