ప్రభుత్వ కార్యాలయాల్లో పలుచోట్ల లంచావతారులు
● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర
అన్ని శాఖల్లోనూ
డబ్బులిస్తేనే పనులు
● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న అధికారులు
● ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు చిక్కిన వైనం
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంత మంది అధికారులు లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. పలు కీలక శాఖల్లో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తరచుగా ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. పలువురు అధికారులు తమ లంచగొండితనాన్ని మాత్రం వీడటం లేదు. తాజాగా బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీకి చిక్కడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
చేయి తడిపితేనే పని..
ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలుకొని కీలకమైన భూ రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిదానికీ ఎంతో కొంత సమర్పించుకోనిదే పని కావడం లేదు. పలువురు బాధితులు చైతన్యంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే తప్ప సంబంధిత శాఖలో పర్యవేక్షణ, విజిలెన్స్ గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
లంచం
తీసుకుంటూ
ఏసీబీకి పట్టుబడిన వంగూరు లైన్‌మెన్
నాగేందర్(ఫైల్)
సమాచారం ఇస్తే తక్షణమే స్పందిస్తున్నాం..
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అవినీతిపై ఏసీబీకి వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి తక్షణమే దాడులు చేపడుతున్నాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించండి. టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. – సీహెచ్ బాలకృష్ణ, డీఎస్పీ,
ఏసీబీ, మహబూబ్‌నగర్


