● రెండు, మూడు రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాం
● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటివ్
కందనూలు: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ధాన్యం తూకం విధానం, నాణ్యతా ప్రమాణాలు, నిల్వ ఏర్పాట్లు, రవాణా సదుపాయాలపై అధికారులతో ఆరా తీశారు. అదే విధంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ధాన్యం అమ్మకంలో ఆలస్యం, తూకం ప్రక్రియలో పారదర్శకత, చెల్లింపుల జాప్యం వంటి అంశాలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రెండు, మూడు రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు తమ పంటను మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చిన వెంటనే తూకం ప్రక్రియ పూర్తి చేయాలని, అనవసర ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. అదే విధంగా రైతులకు చెల్లింపులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అమరేందర్ మార్క్‌ఫెడ్ డీఎం తమీనా, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఆర్డీఓ సురేశ్‌బాబు ఉన్నారు.
పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి..
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సర్పంచ్, వార్డు సభ్యుడు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను తరచుగా సందర్శించి.. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధన, పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఎంఈఓ కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.


