మరింత చేరువగా దూరవిద్య
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం అక్షరాస్యతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అడ్మిషన్లు పెంచడంతోపాటు చదువు మధ్యలో మానేసి చదువుకు దూరంగా ఉన్న విద్యార్థులు చదువుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. అందులో భాగంగా ఓపెన్ స్కూల్ ద్వారా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున అడ్మిషన్లు ఇస్తుంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 4,600 అడ్మిషన్లు ఇవ్వగా.. ఈసారి ఏకంగా 8,641 అడ్మిషన్లు ఇవ్వడం గమనార్హం.
పాఠశాలకు వెళ్లలేని వారు..
చాలామంది ఆర్థిక కారణాలు, ఇతర సమస్యల వల్ల మధ్యలో చదువు మానివేసి ఉంటారు. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లి చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ పూర్తిచేయడంతో పాటు ఇంటర్‌లో బైపీసీ ఇతర ఆర్ట్స్ కోర్సులు కూడా చదువుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. వారం మొత్తం పనులు చేసుకుని వారంలో చివరి రోజు అయిన ఆదివారం మాత్రం తమకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్‌లో తరగతులు వినేందుకు ఓపెన్ స్కూల్ అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం సిలబస్‌లో 30 తరగతులు శని, ఆదివారాల్లో జరుగుతాయి. ఫీజులు చెల్లించిన వాటితోనే స్టడీ పుస్తకాలు కూడా అధికారులు అందజేస్తున్నారు.
రెగ్యులర్ వారితో సమానంగా..
ఓపెన్ స్కూల్ ద్వారా చదివితే రెగ్యులర్ సర్టిఫికెట్‌కు ఉన్నంత ప్రాధాన్యత ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకున్న సర్టిఫికెట్‌ను అదే స్థాయిలో గుర్తిస్తారు. ఓపెన్‌లో ఎస్సెస్సీ పూర్తి చేసి ఇంటర్ రెగ్యులర్‌గా చదువుకోవచ్చు. ఇక ఓపెన్‌లో ఇంటర్ చదివితే ఐఐటీ, నీట్‌తోపాటు ఇంటర్‌స్థాయిలో ఉండే అన్ని ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వీరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ అడ్మిషన్లు కావడానికి ప్రధాన కారణం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని స్వయం సహాయక సంఘాల సభ్యులు చదువులు మధ్యలో మానివేసిన వారితో అధికారులు ఎక్కువగా అడ్మిషన్లు చేయించారు. వీటితో పాటు వివిధ సమీకృత కంపెనీలు, సంస్థల్లో కూడా మధ్యలో చదువు మానివేసిన వారిని గుర్తించి అడ్మిషన్లు చేయించారు.
ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ఓపెన్ స్కూల్ సేవలు
గతం కంటే ఎక్కువ అడ్మిషన్లు
కల్పించిన అధికారులు
చదువు మధ్యలో మానేసిన ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులకు సదావకాశం
పనిచేసుకుంటూనే చదువు
కొనసాగించే వెసులుబాటు
2,823 అడ్మిషన్లతో మహబూబ్‌నగర్ రాష్ట్రంలోనే అగ్రస్థానం
మరింత చేరువగా దూరవిద్య


