ప్రాతినిధ్యం కరువు
బీసీ వర్గాలకు మూడు మండలాల్లో దక్కని చోటు
ప్రభావిత వర్గంగా ఎస్సీలు..
సాక్షి, నాగర్‌కర్నూల్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం మేరకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు నెరవేరలేదు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ రిజర్వేషన్లను అమలుచేశారు. అయితే జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా.. మూడు మండలాల్లో బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. మరో మూడు మండలాల పరిధిలో బీసీ వర్గాలకు రిజర్వేషన్ ఒక్క సర్పంచ్ స్థానానికే పరిమితం అయ్యింది. అలాగే అమ్రాబాద్, పదర మండలాల్లో అత్యధిక సంఖ్యలో ఎస్సీ జనాభా ఉన్నప్పటికీ ఆయా మండలాల్లో వారికి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
ఒక్క స్థానం కూడా..
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు సంబంధించి జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండలాల్లో బీసీ వర్గాలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వ్ కాలేదు. దీంతో మూడు మండలాల పరిధిలో బీసీలకు రిజర్వేషన్లలో అవకాశం లేకుండాపోయింది. అచ్చంపేట మండలంలో మొత్తం 38 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 27 సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు, మూడు ఎస్సీలకు రిజర్వ్ కాగా, 8 స్థానాలు అన్ రిజర్వ్ అయ్యాయి. అమ్రాబాద్ మండలంలో 20 సర్పంచ్ స్థానాలుంటే 19 స్థానాల్లో ఎస్టీలకు, ఒకటి అన్‌రిజర్వు అయ్యింది. ఈ మండలంలో తుర్కపల్లి గ్రామం ఒక్కటే జనరల్ ఉంది. పదర మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని స్థానాలను ఎస్టీలకే కేటాయించారు. అలాగే బల్మూరు, లింగాల, చారకొండ మండలాల్లో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు రిజర్వ్ అయ్యింది. బల్మూర్ మండలంలో మొత్తం 23 జీపీలకు గానూ మంగలికుంటపల్లి ఒక్కటే బీసీలకు కేటాయించారు. లింగాల మండలంలో 23 సర్పంచ్ స్థానాలు ఉండగా, క్యాంపు రాయవరంలో బీసీలకు అవకాశం దక్కింది. చారకొండ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉంటే వీటిలో చారకొండ మండల కేంద్రం ఒక్కటే బీసీలకు రిజర్వ్ అయ్యింది. ఊర్కొండ మండలంలో 16 గ్రామాలు ఉంటే ఊర్కొండ, మాధారం గ్రామాలను బీసీలకు కేటాయించారు.
మరో మూడుచోట్ల ఒక సర్పంచ్ స్థానానికే పరిమితం
అమ్రాబాద్, పదర, అచ్చంపేటలో అన్ని గ్రామాలు ఎస్టీలకే రిజర్వ్
బల్మూరు మండలంలో బీసీలకు ఒకటే సర్పంచ్ స్థానం
అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఎస్సీ జనాభా ప్రభావిత వర్గంగా ఉంది. అప్పర్‌ప్లాట్‌గా పిలుచుకునే అమ్రాబాద్, పదర మండలాల్లో ఎస్సీల జనాభే ఎక్కువ. అయితే ఈ రెండు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానంలో కూడా పోటీ చేసేందుకు ఎస్సీలకు అవకాశం లేదు. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉండటంతో ఈ మండలాల పరిధిలోని గ్రామాలన్నీ ఎస్టీలకే రిజర్వ్ అయ్యాయి. ఈ క్రమంలో ఒక్కరు కూడా ఎస్టీ జనాభా లేని కల్ములోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్‌నగర్, లక్ష్మాపూర్, కుమ్మరోనిపల్లి గ్రామాల్లోనూ ఎస్టీలకే రిజర్వ్ అయ్యాయి. దీంతో పోటీ చేసేందుకు ఎస్టీలే లేకపోవడంతో ఈ గ్రామాలు సర్పంచులు లేకుండానే ఉండిపోనున్నాయి. పదర మండలంలో పది గ్రామ పంచాయతీలు ఉండగా, అన్ని స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ అయ్యాయి. అచ్చంపేట మండలంలోనూ మొత్తం 38 స్థానాలకు గానూ 27 స్థానాల్లో ఎస్టీలకు కేటాయించగా, ఎస్సీలకు 3 సర్పంచ్ స్థానాల్లో అవకాశం దక్కింది.
ప్రాతినిధ్యం కరువు


