ఎయిడ్స్ నివారణకు ముందస్తు చర్యలు
నాగర్‌కర్నూల్/ కందనూలు: ఎయిడ్స్ వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు ముఖ్యమని, ఎయిడ్స్ నియంత్రణలో సమాజంలోని ప్రతిఒక్కరి పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో ఎయిడ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన లేక వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. ఆస్పత్రులు, రక్త బ్యాంకుల్లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పనిసరిగా రక్త నమూనాలను క్షుణ్ణంగా పరీక్షించాలనే చెప్పారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే వ్యక్తులు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటూ సూచించిన మందులు వాడితే ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. సరైన సమయంలో మందులు, పోషకాహారం తీసుకోవడం ద్వారా వ్యాధిపై నియంత్రణ సాధ్యమన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, డీఎంహెచ్‌ఓ రవికుమార్, వైద్యులు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
రైతులను అప్రమత్తం చేయాలి..
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, వరిధాన్యం, పత్తి తడవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో వరికోతలు కోసిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన సూచనలు చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ రైతులకు అన్నివిధాలా సహకరించాలని కోరారు.
పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ
జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల అధికారి వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు రాజ్యలక్ష్మి, భీమ్లానాయక్ హాజరయ్యారు.


