నేటినుంచి నూతన మద్యం పాలసీ
గణనీయంగా అమ్మకాలు
● ఉమ్మడి జిల్లాలో 227దుకాణాలు ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు
● గుడ్‌విల్ ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారులు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మొత్తం 227 ఏ4 మద్యం దుకాణాలకు అక్టోబర్ 6 నుంచి 23 వరకు టెండర్లు నిర్వహించగా 5,536 దరఖాస్తులు వచ్చాయి. దీంతో అక్టోబర్ 27న ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో కలెక్టర్లు లక్కీడిప్ నిర్వహించి 227 మంది నూతన మద్యం లైసెన్స్‌దారులను ఎంపిక చేశారు. ఈ మేరకు కొత్తగా లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునే పనుల్లో తలమునకలయ్యారు.
ప్రస్తుతం రెండేళ్లు ఉండే నూతన మద్యం వ్యాపారులకు స్థానిక పంచాయతీ ఎన్నికలతోపాటు రాబోయే పరిషత్, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు కలిసి రానున్నాయి. ఆయా ఎన్నికల్లో మద్యం అమ్మకాలు తారస్థాయిలో ఉంటాయి. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలకు బెల్ట్ దుకాణాలకు అధిక మోతాదులో లిక్కర్ సరఫరా కానుంది. దీంతో మండల కేంద్రాల్లో ఉన్న లిక్కర్ దుకాణాలతోపాటు పట్టణాల్లో సైతం గణనీయంగా అమ్మకాలు పెరగనున్నాయి.


