
వైకల్యం ఉన్నవారిని వేధిస్తే చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: మానసిక వైఫల్యం చెందిన వ్యక్తుల పట్ల సమాజం సహృద్భావంతో మెలిగి వారికి అన్ని రకాలుగా సహాయపడాలని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ శ్రీరాం ఆర్య అన్నారు. సోమ వారం మండలంలోని గుడిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలో వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని హక్కులను అమలు చేయడం వారి బాధ్యత అన్నారు. వైకల్యం గల వ్యక్తులను హింసించినా, వారితో క్రూరంగా ప్రవర్తించినా, అసహ్యంగా మాట్లాడినా, అగౌరవపరిచి నా జైలుశిక్ష విధిస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అనుకోని ప్రమాదాల నుంచి వైకల్యం గలవారిని ఇతర వ్యక్తులతో సమానంగా రక్షణ భద్రత కల్పించాలన్నారు. అంగవైకల్యం ఉన్న వారికి సంతాన ఉత్పత్తి కుటుంబ నియంత్రణ విషయంలో తగిన సమాచారంపై అవగాహన కల్పించాలన్నారు. వికలాంగులు తమ సమస్యల గురించి టోల్ ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేసి వినియోగించుకోవాలన్నారు. ఉచిత న్యాయ సలహాలు, సూచనల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కుర్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.