
జనరల్ ఆస్పత్రిలో సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ ఉదయ్‌కుమార్
నాగర్‌కర్నూల్ క్రైం: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని.. జనరల్ ఆస్పత్రికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని కలెక్టర్ ఉదయ్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రలోని జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనరల్ ఆస్పత్రిని మెడికల్ కళాశాలకు అప్పగించినందున రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, భవనంలో ఇంకా కొన్ని విభాగాలకు సరైన వసతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, అవసరమైన వైద్య సిబ్బందిని సైతం నియమించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి సోమ, బుధవారం గర్భిణులు ఏఎన్‌సి చెకప్‌కు అధిక సంఖ్యలో రావడం, లేబొరేటరీ పరీక్షలు, ప్రసవాలు, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డుల్లో రోగుల సంఖ్య పెరగటంతో స్థలాభావం వంటివి పరిశీలించారు. చిన్న పిల్లలకు టీకాలు ఇచ్చే ముందు భాగంలో ఎక్సరే గది, పక్కన స్కానింగ్ గది ఉండడం ఇబ్బందికరమని ఎక్సరే గది మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలోని ఖాళీ స్థలం అపరిశుభ్రంగా ఉండడం, పందులు సంచరిస్తుండడాన్ని గమనించి అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బందిని పిలిపించి వెంటనే పరిసరాలు శుభ్రం చేయించాలని, వేసవి నేపథ్యంలో గ్రీన్ మ్యాట్ వేయాలని, అక్కడ వాహనాలు ఆపేందుకు పార్కింగ్ స్థలంగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ఆర్‌ఎంఓలు, స్టాఫ్ నర్స్‌లకు సరిపడా నర్సింగ్ స్టేషన్లు, దుస్తులు మార్చుకునే గదులు, నర్సింగ్ కౌంటర్లు లేవని.. సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, డీసీహెచ్ రమేష్ చంద్రతోపాటు దశరథం, బలరాం, అజీమ్ ఉన్నారు.
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నాగర్‌కర్నూల్: ఏప్రిల్ 3 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు కలెక్టర్ ఉదయ్‌కుమార్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో కలెక్టర్, ఏఎస్పీ రామేశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ.. జిల్లాలో 10,572 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారని, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 60 రెగ్యులర్, ఒక ప్రైవేట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో సి కేటగిరి పరీక్ష కేంద్రాలు 6 ఉన్నాయని వాటికి సకాలంలో ప్రశ్నపత్రాలు చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే, కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా రూట్ల వారీగా బస్సులు ఏర్పాటు చేశామని, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తుకు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు.
ప్రశాంతంగా రాయాలి..
అనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యార్థులు అనవసరపు ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్ష సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుందని, విద్యార్థులు కేంద్రాలకు 9గంటల వరకే చేరుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ గోవిందరాజులు, ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్, పోస్టల్, విద్యుత్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.