భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రానికి భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించగా దర్శించుకున్న భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.


