ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ఆదివారం అధికారులతో కలిసి వెంగ్లాపూర్ నుంచి బయ్యక్కపేట వరకు ట్రాఫిక్ నియంత్రణకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జాతర బందోబస్తుకు వచ్చే పోలీస్ అధికారులకు, సిబ్బందికి మేడారంలో వసతుల కోసం నిర్దేశించిన ప్రదేశాలను చూసి ఆయా ప్రదేశాల్లో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతర బందోబస్తుకు వచ్చే అధికారులకు, సిబ్బందికి లోటుపాట్లు లేకుండా వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర ప్రారంభానికి ముందుగానే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మేడారంలో సాగుతున్న రోడ్ల విస్తరణ, గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో చేపట్టిన రాతి పిల్లర్ల ఏర్పాట్ల పనులను ఎస్పీ పరిశీలించారు. జాతరలో భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, ఆర్‌ఐలు స్వామి, వెంకటనారాయణ, తిరుపతి ఉన్నారు.


