కాళేశ్వరంలో భక్తుల పూజలు
కాళేశ్వరం: ఆదివారం సెలవురోజు కావడంతో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు చేశారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆల య పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తుల సందడితో కోలాహలంగా కనిపించింది.
ఆర్టీఐ రక్షక్ జిల్లా అధ్యక్షుడిగా కమల్‌మిత్ర
భూపాలపల్లి అర్బన్: ఆర్టీఐ రక్షక్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా లూయిస్ కమల్ మిత్రను నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కట్ట సురేష్‌బాబును నియమించారు. జిల్లాలో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడానికి బాధ్యతలు స్వీకరించినట్లు కమల్‌మిత్ర తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ప్రతీ పౌరుడికి సమాచారం సేకరించే హక్కు ఉందని తెలిపారు. ఈ బాధ్యత అప్పగించినందుకు వ్యవస్థాపక అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రస్థాయిలో విద్యార్థుల ప్రతిభ
టేకుమట్ల: మండలకేంద్రంలోని శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కుంగ్‌ఫూ–కరాటేలో రాష్ట్ర స్థాయిలో చాంపియన్‌షిప్ ట్రోఫీ సాధించినట్లు కరస్పాండెంట్ హరీశ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతినికేతన్ విద్యార్థులు వేములవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుంగ్‌ఫూ– కరాటే చాంపియన్‌షిప్ 2025లో పాల్గొని విజయం సాధించినట్లు చెప్పారు. పిల్లలు చూపిన క్రమశిక్షణ, ధైర్యం, నైపుణ్యం అందరినీ ఆకట్టుకుందని చెప్పారు. అనంతరం విద్యార్థులను అభినందించారు.
వేయిస్తంభాల ఆలయంలో పల్లకీసేవ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆదివారం మార్గశిర బహుళ తదియ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరీరుద్రేశ్వస్వామి వార్లకు ఆదివారం పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 121 మంది దంపతులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీశ్రీరుద్రేశ్వస్వామి వార్లను పల్లకీసేవలో ప్రతిష్టించి మంగళవాయిద్యాలతో, హారతులతో ఆలయ పరిక్రమచుట్టూ పల్లకిసేవ నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
‘శాంతితోనే అభివృద్ధి’
హన్మకొండ: శాంతితోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని పూర్వ వరంగల్ జిల్లా కలెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ‘ఎగిరే శాంతి కపోతం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వళన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శాంతి దిశగా ఆలోచించాలన్నారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ మహమ్మద్ ఇక్భాల్ అలీ తదితరులు మాట్లాడారు. మహమ్మద్ సిరాజుద్దీన్ పుట్టిన రోజును పురస్కరించుకుని విశ్రాంత ఆచార్యులు గూడ నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు విజయ్‌బాబు, విప్పనపల్లి రవికుమార్, డాక్టర్ విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరంలో భక్తుల పూజలు


