జోరుగా ప్రచారం..
● జిల్లాలో ముగిసిన నామినేషన్ల పర్వం
● రెండు విడతల్లో 24 పంచాయతీలు ఏకగ్రీవం
● పట్టణాల్లో ఉన్న వారికి అభ్యర్థుల ఆఫర్లు
● ఓటర్లను ఆకట్టుకునేలా నాయకుల ప్రయత్నాలు
ములుగు: జిల్లాలోని 9 మండలాల పరిధిలో మూడు విడతల్లో జీపీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార జోరును అభ్యర్థులు పెంచారు. ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు ప్రణాళికలతో ముందుకుసాగుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ప్రధానంగా పోటీపడుతున్నారు. మొదటి, రెండో విడతలో జరగనున్న మండలాల్లో ఇప్పటికే పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తవగా బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు ఆయా పార్టీలు గ్రామాభివృద్ధికి అంటూ పలు ఆఫర్లు ప్రకటించాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య కొన్నిచోట్ల సఖ్యత కుదిరి ఏకగ్రీవం అయ్యాయి. అధికార పక్షానికి సర్పంచ్, ప్రతిపక్ష పార్టీకి ఉప సర్పంచ్, వార్డులు కేటాయించి పరస్పరం సహకరించుకున్నారు. మిగిలిన చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరెవరనేది తేటతెల్లమైంది. మూడో విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ, పరిశీలన పూర్తయింది.
జిల్లాలో 25 పంచాయతీలు ఏకగ్రీవం
జిల్లాలో 146 గ్రామపంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మొదటి విడతలో 9 జీపీలు, రెండో విడతలో 15 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు, మూడో విడతలో కన్నాయిగూడెం మండల పరిధిలోని ముప్పనపల్లి పంచాయతీకి సింగిల్ నామినేషన్ దాఖలైంది. మొదటి విడతలో గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి, కోటగడ్డ, ముత్తాపూర్, రాఘవపట్నం, కర్లపల్లి, ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలో అంకంపల్లి, పంబాపూర్, నర్సాపూర్, ఏటూరునాగారం మండలంలో శంకరాజుపల్లి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో ములుగు మండల పరిదిలోని అంకన్నగూడెం, రాయినిగూడెం, కొత్తూరు, జగ్గన్నపేట, పెగడపల్లి, బంజారుపల్లి, మల్లంపల్లి మండల పరిధిలోని గుర్తూరుతండా, ముద్దునూరుతండా, కొడిశలకుంట, దేవనగర్, వెంకటాపురం(ఎం) మండలంలో అడవిరంగాపూర్, నర్సింగాపూర్, తిమ్మాపూర్, పాపయ్యపల్లి, కేశవాపురం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకుంటే మరిన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
దూర ప్రాంతాల్లో ఉన్న వారికి..
పల్లెల నుంచి పట్టణాలకు వలసవెళ్లిన వారు, ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సర్పంచ్ అభ్యర్థులు ఫోన్‌లు చేసి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటు వేసేందుకు వస్తే ఓటుకు రూ.500 నుంచి రూ.1000 ఇవ్వడమే కాకుండా బస్‌ఛార్జీలు సైతం చెల్లిస్తామని చెబుతున్నారు. జిల్లా నుంచి సుమారుగా 3 వేలకు పైగా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. 10 మంది ఓటర్లు ఒకే ప్రాంతంలో ఉంటే ప్రత్యేకంగా వాహనాన్ని మాట్లాడుకుని రావాలని కిరాయి డబ్బులను ఓటర్లకు అభ్యర్థులు పంపుతున్నట్లు తెలిసింది.
మండలం పంచాయతీలు ఏకగ్రీవం బరిలో
ఉన్నవారు
ఎస్‌ఎస్ తాడ్వాయి 18 3 52
గోవిందరావుపేట 18 5 52
ఏటూరునాగారం 12 1 41
వెంకటాపురం(ఎం) 23 5 43
మల్లంపల్లి 10 4 58
ములుగు 19 6 81
వాజేడు 17 0 65
వెంకటాపురం(కె) 18 0 87
కన్నాయిగూడెం 11 1 52
గ్రామాల్లో సందడి వాతావరణం
మొదటి, రెండో విడత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరెవరనేది స్పష్టత రావడంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో గ్రామాల్లో ప్రచార చేపట్టగా సందడి వాతావరణం నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు. దీంతో ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థుల విజయానికి నాయకులు రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన నేతలతో పాటు, మండలాలకు చెందిన నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించి ముందుకు కదులుతున్నారు. మొదటి విడత పోలింగ్ 11వ తేదీ కాగా రెండో విడతకు 14న, మూడో విడతకు 17న పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కించి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. మెజార్టీ వార్డు సభ్యులు ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
జోరుగా ప్రచారం..


