సెక్టార్ అధికారుల పాత్ర కీలకం
● అదనపు కలెక్టర్ సంపత్‌రావు
ములుగు/ఏటూరునాగారం: ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్‌రావు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు, పరిశీలించాల్సిన ఆంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంపత్‌రావు మాట్లాడుతూ గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని డీఆర్‌సీ కేంద్రాలలో సమస్యలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ సాఫీగా జరిగేలా చూడాలన్నారు. శిక్షణ సామగ్రి, పోలింగ్‌కు ముందు, తర్వాత చేయాల్సిన, చేయకూడని చెక్ లిస్ట్ పంపిణీ చేసినట్లు తెలిపారు. సెక్టార్ అధికారులు పోలింగ్ స్టేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కనీసం మూడు సార్లు ప్రతీ పోలింగ్ స్టేషన్ వెళ్లి మౌలిక సదుపాయాలు చూసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి రాతలు ఉండకూడదని, 100 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు, సామగ్రి ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఏటూరునాగారంలోని డిగ్రీ కళాశాలలో ఆర్వోలు, ఏఆర్వోలు, పీఓలకు శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నారు. తొలి విడతలో ఎస్‌ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట మండలాల్లో ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ సజావుగా జరిగేలా ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. శిక్షణ తరగతుల్లో సూచించిన అంశాలను పాటించాలన్నారు. అనంతరం ఏటూరునాగారం మండల పరిధిలోని 130 పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్‌ఓలకు బూత్‌ల వారీగా ఓటరు స్లిప్పులను అందజేసినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో బూత్ లెవల్ ఆఫీసర్లకు అందజేసి ప్రతీ ఓటర్‌కు స్లిప్‌ను అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.


