మహాజాతర పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల పరిధిలోని మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణం పనులు, సీసీ ప్లోరింగ్ పనులను, ప్రధాన ద్వారం ఆర్చీ స్తంభాలను ఆయన శనివారం పరిశీలించారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల విస్తరణ పనులను పరిశీలించి అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, యంత్రాలను ఉపయోగించాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. జాతర సమయంలో కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి వస్తుంటారని తెలిపారు. ఈ క్రమంలో భక్తులను దర్శనానికి పంపించే క్యూ లైన్లు అతి ముఖ్యమని వెల్లడించారు. క్యూ లైన్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను పూర్తిచేయాలన్నారు. రోడ్ల విస్తరణ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన గడువులోపు పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
గద్దెల ప్రాంగణం పనుల పరిశీలన
మేడారంలోని గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం పర్యవేక్షించారు. జాతరలో పనుల పురోగతి పరిశీలించారు. గద్దెల ప్రాంగణం సాలహారం నిర్మాణం చుట్టూ ఏర్పాటు చేస్తున్న రాతి పిల్లర్లను పరిశీలించారు. జాతర సమయంలో పోలీస్ అత్యవసర సేవలకు అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎస్పీ సూచనలు చేశారు. జాతర సమయంలో భారీగా మేడారానికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టలో ఉంచుకుని గద్దెల ప్రాంగణంలో భక్తుల భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, అత్యవసర సేవలపై అధికారులతో ఎస్పీ చర్చించారు. తొలుత అమ్మవార్లను ఎస్పీ దర్శించుకున్నారు.


