పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్
ములుగు: జిల్లాలోని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ.వేణుగోపాల్ సూచించారు. జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల న్యాయ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై పెండింగ్‌లోని సివిల్, క్రిమినల్, ఇతర కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయ పరిపాలన విషయాలపై చర్చించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీ పీ సూర్య చంద్రకళ, భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్ బాబు, మహబూ బాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు
అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. పూజారులు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.


