ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు రూరల్ : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నియంత్రణ చర్యల్లో భాగంగా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అధికారులకు సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి ఆదివారం గట్టమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వారు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మేడారం వచ్చే భక్తులు ఆది దేవత గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తారని అందుకు అనుగుణంగా పార్కింగ్ స్థలాలను గుర్తించాలని తెలిపారు. వాహనాల రాకపోకలతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండే విధంగా ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు సహకరించాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు వేర్వేరు ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఫారెస్టు రేంజ్ అధికారి శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శంకర్, సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.


