పుష్కర ఘాట్లకు పగుళ్లు
రామన్నగూడెంలో గోదావరి వద్ద నెర్రెలుబారి కూలిపోయిన పుష్కర ఘాట్ మెట్లు
ఘాట్ వద్ద కోతకు గురవుతున్న ఒడ్డు
ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, మంగపేట మండలంలో పుష్కరఘాట్లు గోదావరి ప్రవాహానికి పగుళ్లు తేలి, నెర్రెలుబారి ప్రశ్నార్ధకంగా మారాయి. కరకట్ట కోతకు గురవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కరకట్ట పునఃనిర్మాణం చేపడుతామన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో గోదావరి నది సుమారు 110 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. పవిత్ర గోదావరి నది స్నానం, పుణ్యకార్యాలు, కర్మలకు ప్రాధాన్యంగా నిలుస్తోంది. జిల్లాలోని రామన్నగూడెం వద్ద 2003లో గోదావరి పుష్కరాల సందర్భంగా అప్పటి ప్రభుత్వం రూ.67లక్షల నిధులతో పుష్కర ఘాట్‌ను నిర్మించారు. 12 సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కరాల కోసం మొట్టమొదటిగా రామన్నగూడెం ఘాట్‌ను నిర్మించడం గమనార్హం. అనంతరం 2015లో వచ్చిన పుష్కరాలకు మరో రూ.కోటి కేటాయించి అదనపు ఘాట్‌ను నిర్మించారు. ఈ రెండు ఘాట్‌లు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. వర్షాకాలంలో వచ్చే వరదలకు గోదావరి నది ఉధృత రూపానికి పుష్కరఘాట్ బీటలు తేలి, నెర్రెలుబారి పగిలిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. గోదావరి వరద ఉధృతి వల్ల కాంక్రీట్ మెట్లు సైతం కూలిపోయాయి. అక్కడ భక్తులు దిగేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. మరోమారు గోదావరి వస్తే ఇక్కడ పుష్కర ఘాట్‌కు మెట్లు ఉండేవి అనే సందేహం నెలకొనే పరిస్థితి ఉంది. మంగపేటలోని పుష్కరఘాట్ సైతం గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయింది. గోదావరి మెట్లకు నెర్రెలుబారింది. ఇక్కడ కూడా 2015లో పుష్కరాల సమయంలో మొదటగా గోదావరి పుష్కర ఘాట్‌ను ఏర్పాటు చేశారు.
వచ్చే పుష్కరాలకు కేంద్ర బిందువు
2027లో జరగనున్న గోదావరి పుష్కర ఘాట్‌కు రామన్నగూడెం అత్యంత కీలకమైంది. గోదావరి ఒడ్డు వెంట శివాలయం ఉండడంతో గోదావరిలో స్నానం ఆచరించిన భక్తులు శివపార్వతులను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందుకు రామన్నగూడెం పుష్కరఘాట్‌కు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరి వరద ప్రతీ ఏటా కొత్త రూపాన్ని దాల్చి ప్రవాహ సరళిని మార్చుకొని ప్రవహిస్తోంది. గోదావరి ఉగ్రరూపం వల్ల ఘాట్ కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. పదేళ్ల నుంచి కరకట్ట పునఃనిర్మాణం చేపడుతామన్న ప్రభుత్వాలు మిన్నకుండి పోతున్నాయి. కరకట్టతోపాటు ఘాట్ కూడా లేకుండా పోయే దుస్థితిలోకి వచ్చింది.
అధికారుల సందర్శన
కేంద్ర జలవనరులు, భారీ నీటిపారుదల శాఖ అధికారులు సైతం కరకట్ట వెంట ఉన్న పుష్కర ఘాట్‌ను చాలాసార్లు పరిశీలించారు. గోదావరి వరద సమయంలో సైతం జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రులు సైతం రామన్నగూడెం పుష్కరఘాట్‌ను సందర్శించి మరమ్మతు చర్యలు చేపడుతామని పేపర్ల ప్రకటన మాత్రమే చేసి వదిలేశారు. సర్వేలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినప్పటికీ ఉలుకు పలుకు లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ముందు చూపులేని తనంతో గోదావరి పవిత్రకు, రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. గోదావరి వరద గ్రామాల్లోకి రాకుండా నిర్మించిన రక్షణ గోడలు ఒక్కొక్కటిగా నీటిలో కలిసిపోతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి ఉగ్రరూపానికి జలసమాధి కావాల్సి వస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోతకు గురవుతున్న ఒడ్డు
పుష్కర ఘాట్‌కు రక్షణగా నిర్మించిన మట్టి కట్ట, ఒడ్డు సైతం గోదావరి వరదతో కోతకు గురవుతోంది. దీనివల్ల ఘాట్‌కు ఇటు గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది. మట్టి ప్రతి ఏడాది గోదావరి నీటిలో కలిసిపోతూ మూడు మీటర్ల మేర గుంతలు ఏర్పడ్డాయి. మట్టి కొట్టుకుపోతుండడంతో ఘాట్‌కు ఉన్న రక్షణ గోడలు సైతం కూలిపోయే దశకు చేరడం గమనార్హం. ఇలానే వదిలేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు.
మరమ్మతులు చేపట్టేనా?
కోతకు గురవుతున్న కరకట్ట
వచ్చే పుష్కరానికి కీలకం కానున్నరామన్నగూడెం ఘాట్
పుష్కర ఘాట్లకు పగుళ్లు
పుష్కర ఘాట్లకు పగుళ్లు


