హేమాచలానికి పోటెత్తిన భక్తులు
మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు వాహనాల్లో వేలాదిగా తరలివచ్చి సందడి చేశారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద భక్తులు స్నానాలు ఆచరించి స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి ఆలయ చరిత్ర, పురాణం వివరించి వేదాశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల నుంచి అయ్యప్ప మాలధారులు, భక్తులు తరలివచ్చి లక్ష్మీనర్సింహస్వామి దర్శించుకున్నారు.


