మేడారంలో హెల్త్ డైరెక్టర్ పర్యటన
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వైద్యశిబిరాల స్థలాలను రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ శనివారం పరిశీలించారు. మేడారంలో 2026 జనవరి 28నుంచి 31వరకు జరుగనున్న మహాజాతర నేపథ్యంలో భక్తులకు అందించే వైద్యసేవల ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తు పర్యటించారు. టీటీడీ కల్యాణ మండపాన్ని దర్శించి ఆస్పత్రి ఏర్పాటుపై ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత జాతరలో వైద్యసేవల పరంగా ఏర్పడిన ఇబ్బందులను ఈసారి జాతరలో తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. కార్యక్రమంల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ గోపాల్‌రావు, అప్పయ్య, సాంబశివరావు, డీపీఎం సంజీవరావు పాల్గొన్నారు.
లక్ష్మీదేవరకు
విడిది ఏర్పాటు చేయాలి
వెంకటాపురం(ఎం) : మేడారం వనదేవతల సన్నిధిలో సమ్మక్క– సారక్కల ఆడబిడ్డ అయిన ఆదివాసీ లక్ష్మీదేవరకు విడిది ఏర్పాటు చేయాలని ఆదివాసీ నాయక పోడ్ దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బా సుధాకర్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో లక్ష్మీదేవర గుడారపు పండుగకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడారం మహాజాతరలో సమ్మక్క–సారలమ్మ గద్దెలకు రాకముందే ఆదివాసీ లక్ష్మీదేవర వనదేవతల గద్దెలు తొక్కుతుందని పేర్కొన్నారు. మేడారంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు ఆదివాసీల ఇలవేల్పు లక్ష్మీదేవరలకు మేడారంలో విడిది ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయక పోడ్ దెబ్బ కోఆర్డినేటర్ నెమలి నర్సయ్య, నాయకులు బొల్లెం సారయ్య, గాలి సమ్మయ్య, మధు, సరోజన, యాదగిరి, రాజు, స్వామి, కనకయ్య, రామక్క తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకం
హన్మకొండ: భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఇన్‌చార్జ్‌ల పేర్లను శనివారం ప్రకటించారు. హనుమకొండ జిల్లాకు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి)ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. వరంగల్‌కు కొండపల్లి శ్రీధర్ రెడ్డి (ఖమ్మం), జయశంకర్ భూపాలపల్లికి దశమంత రెడ్డి (జనగామ), మహబూబాబాద్‌కు డాక్టర్ జరుపులావత్ గోపి (నల్లగొండ), ములుగు జిల్లాకు డాక్టర్ కోరండ్ల నరేష్ (రంగారెడ్డి), జనగామ జిల్లాకు కట్ట సుధాకర్ రెడ్డి (నాగర్ కర్నూల్)ను ఇన్‌చార్జ్‌గా నియమించారు.
భక్తులతో కిక్కిరిసిన హేమాచలం
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామి వారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.
వాటర్ కూలర్ల ఏర్పాటు
ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చుకునేందుకు దాతలు బహూకరించిన వాటర్ కూలర్లను రెండు చోట్ల ఏర్పాటు చేసినట్లు ఈఓ రేవెల్లి మహేష్ తెలిపారు.


