రెండో విడతకు వేళాయె..
● నేటినుంచి నామినేషన్ల స్వీకరణ
● 52 సర్పంచ్.. 462 వార్డులకు ఎన్నికలు
ములుగు: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతగా జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 48 గ్రామ పంచాయతీలకు, 420 వార్డులకు శనివారం వరకు నామినేషన్లు స్వీకరించారు. రెండవ విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల్లోని 52 గ్రామ పంచాయతీలకు, 462 వార్డులకు నేటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 32,242 మంది పురుషులు, 34,478 మహిళలు, తొమ్మిది మంది ఇతరులతో కలిసి మొత్తం 66,729 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్లు స్వీకరించేందుకు ములుగు మండలంలో ఎనిమిది క్లస్టర్లు, వెంకటాపూర్ మండలంలో ఆరు క్లస్టర్లు, మల్లంపల్లి మండలంలో మూడు క్లస్టర్లు ఎర్పాటు చేశారు.
ఏ మండలంలో ఎన్ని జీపీలు..
ములుగు మండలంలో 19 గ్రామపంచాయతీలు, 172 వార్డులు ఉండగా 24,985 మంది ఓటర్లు ఉన్నారు. మల్లంపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు.. 90 వార్డులు ఉండగా 13,505 మంది ఓటర్లు ఉన్నారు. వెంకటాపూర్ మండలంలో 23 గ్రామపంచాయతీలు, 200 వార్డులు ఉండగా 28,239 మంది ఓటర్లు ఉన్నారు.


