ఎన్నికల విధానం చూస్తే బాధేస్తోంది..
ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి..
ఆరోజుల్లో నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి బాధ్యత తీసుకునేవారు
సాక్షి, మహబూబాబాద్ :‘స్వాతంత్య్ర ఉద్యమం, నిజాంపాలన చూశాను. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. సర్పంచ్ పదవితో రాజకీయ ఆరంగ్రేటం చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీగా పనిచేశా. అప్పటి రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు పొంతన లేదు. అప్పుడు మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే తపన ప్రజల్లో ఉండేది. అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకునేది. జీపులు.. డీజిల్ ఖర్చు తప్ప, ఇతరత్రా వ్యయాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఓట్లు పడాలంటే డబ్బులు ఖర్చుపెట్టాలి. ఈవిధానం చూస్తే బాధేస్తోంది’ అని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాటి పరిస్థితులను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
సర్పంచ్‌గా అరంగ్రేటం
చదుకునే రోజులు.. అప్పటివరకు నాకు రాజకీయాలు తెలియదు. అందరి ప్రోత్సాహంతో 1960లో మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏకగ్రీవ ఎన్నిక కావడంతో పెద్దగా డబ్బులు ఖర్చుపెట్టలేదు. నాకు ఇప్పుడు 95ఏళ్లు.. నేను సర్పంచ్‌గా గెలిచినప్పుడు ముప్పై సంవత్సరాలు కూడా లేవు. అయినా సర్పంచ్ అంటే గ్రామంలో ప్రత్యేక ఆదరణ. నాయకుడికి కూడా గ్రామం అన్నా.. గ్రామస్తులు అన్నా.. ప్రాణంగా పనిచేసేవారు. గ్రామాల అభివృద్ధికి ఎంతదూరమైనా పోయేవాళ్లం. ఎన్నికల్లో డబ్బులు పంచడం అంటే తెలియదు. గ్రామాల్లోకి వెళ్తే.. అక్కడి నాయకులే భోజనాలు పెట్టేవారు. పార్లమెంట్ ఎన్నికలకు నాకు అయిన ఖర్చు రూ.7,500 మాత్రమే.. ఇప్పుడు ఒక్క ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది.
కమ్యూనిస్టులతో పోటీ..
ఆరోజుల్లో ఇన్ని పార్టీలు లేవు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండేది. 1967లో ఎంపీగా ఎన్నికై న సమయంలో తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. అప్పుడు మర్రి చెన్నారెడ్డి ఇతర నాయకులు నన్ను తెలంగాణ పార్లమెంటరీ సమితి కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. 1969లో హైదరాబాద్‌లో పదివేల మందితో సత్యాగ్రహ కార్యక్రమం చేశాం. జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అయితే అప్పుడు కమ్యూనిస్టులు ప్రజాప్రతినిధులతో పనులు చేయించేలా పోటీ పడేవారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు. పనిచేసిన వారిని అభినందించే సంస్కృతి ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు.
నాడు గ్రామానికి సేవ చేసే నాయకులను ఎన్నుకునేవారు. ఇప్పుడు డబ్బులు ఖర్చుపెట్టే వారికి టికెట్లు ఇస్తున్నారు. ప్రజలు వారికి ఓట్లు వేసి ఎన్నుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ వాతావరణం మంచిదికాదు. డబ్బులు లేనివారు ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. డబ్బులు పంచి పెట్టడం అంటే అవినీతికి అవకాశం ఇవ్వడమే.. ఈ సంస్కృతి మారాలి. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు కలగజేసుకొని డబ్బులకు, ఎన్నికలకు ఉన్న సంబంధాన్ని విడగొట్టాలి. లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.
ఓటుకు డబ్బులు ఇవ్వడం అంటే..
అవినీతిని ప్రోత్సహించడమే
ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు
ప్రత్యేక దృష్టి పెట్టాలి
‘సాక్షి’తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
రామసహాయం సురేందర్ రెడ్డి
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా
ఎదిగిన రామసహాయం
ఎన్నికల విధానం చూస్తే బాధేస్తోంది..


