ఆశావహులకు ఆప్షన్!
మొదలైన
ఎన్నికల సందడి
‘పంచాయతీ’లో ఓడితే పరిషత్‌కు సై అంటున్న నాయకులు
ములుగు: పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. రిజర్వేషన్ల వారీగా గెలుపు గుర్రాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గ్రామాల్లో అభిప్రాయాలను సేకరిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని సర్పంచ్ పదవులను ఆశిస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. మండల పరిషత్ ఎన్నికల్లో సానుభూతితో గెలవొచ్చనే ధీమాతో పల్లెపోరుకు సిద్ధమవుతున్నారు. మొదటి విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు తమకు అండగా నిలిచి గెలుపొందేందుకు సహకారం అందించాలని కోరుతున్నారు.
మారిన సమీకరణలు
రాజకీయ పార్టీల పరంగా జరిగే పరిషత్ ఎన్నికలను మొదట నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా నోటిఫికేషన్ సైతం గత సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆశావహులు సన్నద్ధమయ్యారు. ప్రధాన పార్టీల తరఫున బీఫాం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల పెంపును కోర్టు సమర్థించకపోవడంతో ఎన్నికలకు బ్రేక్ పడడంతో ఆశావహులు నిరాశ చెందారు. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల కంటే ముందుగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందేందుకోసం ఆశావహులు సన్నద్ధమవుతున్నారు.
పంచాయతీ పోరుకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులు ఎవరున్నారు. ఎవరూ పోటీ చేస్తే గెలుపొందుతారనే వాటిపై పార్టీల పరంగా సర్వేలు నిర్వహించుకుంటున్నారు. పార్టీల పరంగా ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరి నుంచి ఐదుగురు అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నారు. తీవ్రంగా పోటీ ఉన్న చోట సర్పంచ్‌గా ఒకరిని, ఎంపీటీసీగా మరొకరిని ప్రకటిస్తూ సమన్వయం చేస్తున్నారు. కొంతమంది రెండింటిలోనూ పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ఆశావహులు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు.
గ్రామాల్లో మొదలైన ఎన్నికల హడావుడి
ఆశావహులకు ఆప్షన్!


