మహాజాతర విజయవంతానికి పాటుపడాలి
ములుగు రూరల్: మేడారం మహాజాతర విజయవంతానికి పాటుపడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతరను మీడియా, పోలీస్ యంత్రాంగం గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విజయవంతం చేయాలని కోరారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలు పనరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. జాతరకు సుమారు కోటి 50 లక్షల మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లిస్తారని అందుకు అనుగుణంగా 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వివరించారు. మేడారం జాతరలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో కొనసాగుతున్న మాస్టర్ ప్లాన్ పనుల వివరాలతో పాటు అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్ల ఏర్పాటు వివరాలు వెల్లడించారు. పోలీస్ యంత్రాంగం తీసుకునే నిర్ణయాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాల నివారణపై కళాజాతా బృందాలతో అవగాహన కార్యక్రమాలను నిర్విహిస్తామని వివరించారు. అక్రమ మట్టి, పశువుల రవాణాను అడ్డుకుంటామని అన్నారు. జాతర సమయంలో పాత్రికేయులకు ఇబ్బందులు తలెత్తకుండా గుర్తింపుకార్డులు ఇవ్వడానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు కోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలన్నారు. మేడారంలో సాగుతున్న పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్‌లు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రెయిన్‌కోట్లు, టీషర్ట్‌లను ఎస్పీ పంపిణీ చేశారు.
ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన
టీఎన్‌జీవోస్ నాయకులు
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రాంనాథ్ కేకన్‌ను టీఎస్‌జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు పోలురాజు ఆధ్వర్యంలో ఎస్పీని శాలువాలతో సన్మానించి మొక్కను అందించారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


