పంచాయతీ ఎన్నికలకు సహకరించాలి
ములుగు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణ కొనసాగుతుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అలాగే ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల ప్రచారం కోసం ప్రచురించే పోస్టర్లు, ఇతర మెటీరియల్ నిబంధనలకు లోబడి ముద్రణ చేపట్టాలని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. జీపీ ఎన్నికల్లో చట్టాలకు లోబడి ప్రింటింగ్, ప్రచురణ కర్తల పేర్లు, చిరునామాను ముద్రించాలని సూచించారు. ముద్రణ పత్రాలపై ప్రిటింగ్ ప్రెస్ చిరునామా తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. డిక్లరేషన్ పత్రాలను కలెక్టర్, ఎన్నికల స్థాయి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
ఎన్నికల కోడ్ పై వీడియో కాన్ఫరెన్స్..
పంచాయతీ ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 11న మొదటి, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర అధికారులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ఇన్‌చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


