హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. డిసెంబర్ 4న అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తులకు ఆర్టీసీ ఈ అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్–1 డిపోకు సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సు హనుమకొండ నుంచి డిసెంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి 3న ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం చేరుకుంటుందని తెలిపారు. ఇక్కడ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి చేరుకుంటుందని, ఇక్కడ అమ్మవారి దర్శనం అనంతరం బయలుదేరి రాత్రి 7 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణం డిసెంబర్ 4న మధ్యాహ్నం బయలుదేరి 5న ఉదయం జోగుళాంబ అమ్మవారి శక్తి పీఠం సన్నిధికి చేరుకుంటుందన్నారు. ఇక్కడ దర్శనానంతరం బీచుపల్లి హనుమాన్ ఆలయం సన్నిధికి చేరుకుంటుందని, ఇక్కడ దర్శనానంతరం బయలుదేరి హనుమకొండకు చేరుకుంటుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు, పిల్లలకు రూ.3,500గా నిర్ణయించినట్లు వివరించారు. ఆర్టీసీ వెబ్‌సైట్‌లో కాని నేరుగా ఆర్టీసీ రిజర్వేషన్ల కౌంటర్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 8074562195, 9885779970, 9866373825, 9959226047 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.


