హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు శేఖర్‌శర్మ, రాజీవ్ నాగఫణి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి ప్రత్యేకతలు, చరిత్రను వివరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.


