గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ములుగు రూరల్/ఏటూరునాగారం/మంగపేట/కన్నాయిగూడెం: గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని జంగాలపల్లి నుంచి గాంధీనగర్ వరకు చేపట్టనున్న రోడ్డు పనులకు కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులకు రూ.20 కోట్లను కేటాయించామన్నారు. ఇంచర్లలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ, టూరిజం విలేజ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాపార, ఉపాధి రంగాలలో మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. అనంతరం జగ్గన్నపేట గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రం, ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అలాగే కోటక్ మహేంద్ర సహకారంతో 175మందికి ఉచిత శిక్షణ ధ్రువీకరణ పత్రాలు, కుట్టు మిషన్లు అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 9 మందికి, మరో తొమ్మిది యూనిట్ల పాడి గేదెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఎస్పీ రాంనాథ్ కేకన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి, ఏపీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 152 సంఘాలకు రూ. 9.50 కోట్ల రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 17 మందికి, మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి సీతక్క వివరించారు. అలాగే ఎక్కెల, గంటలకుంట గ్రామాల్లోని 500మంది గిరిజనులకు రిలయబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దుప్పట్లు, స్వెటర్లను మంత్రి పంపిణీ చేశారు. రిలయబుల్ ట్రస్ట్ వారు ఏజెన్సీలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. మంగపేట మండలంలోని 419 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.32.72కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. అనంతరం 55మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అలాగే వృద్ధాశ్రమం పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన పనులను భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్‌తో కలిసి ప్రారంభించారు. కన్నాయిగూడెంలోని రైతు వేదికలో రూ.6.47కోట్ల లింకేజీ రుణాల చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. అనంతరం పలువురు కాంగ్రెస్‌లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
మంత్రి సీతక్క
గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం కృషి
గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం కృషి


