నేడు క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
ఏటూరునాగారం: నేడు క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోడి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ జెడ్పీహెచ్‌ఎస్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని పది మండలాల నుంచి ఒక జిల్లా టీంను తయారు చేసి క్రికెట్ షెడ్యూల్ వచ్చిన తర్వాత స్టేట్‌మీట్‌ను ఆడిస్తామని తెలిపారు. ప్రతీ క్రీడాకారుడు నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. క్రీడాకారులు వైట్ డ్రెస్, ఆధార్‌కార్డు, టెన్త్ మెమో వెంట తీసుకొని రావాలని సూచించారు. అండర్ 19, ఓపెన్ టు ఆల్ 30 వయస్సులోపు విద్యార్థులు, క్రీడాకారులు హాజరు కావాలని కోరారు.
ఏటూరునాగారం: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నియామక సమయంలో అర్హత ప్రమాణాలన్ని పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన వారిని మళ్లీ అర్హత నిరూపించుకోమనటం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. టెట్ పరీక్ష ఉద్దేశం కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించబోయే వారికి అర్హతను నిర్దేశించి మాత్రమేనని వివరించారు. తక్షణమే ప్రభుత్వం విద్యాహక్కుల చట్టాన్ని సవరించి టెట్ పరీక్ష నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు.
అక్రమ రవాణాను
అరికట్టేందుకు చెక్‌పోస్టు
కాళేశ్వరం: మహారాష్ట్ర మీదుగా ధాన్యం అక్రమ రవాణాకు చెక్‌పెట్టేందుకు ఖరీఫ్ సీజన్‌లో చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్‌ఓ) కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం మహాదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారి బృందాలు రెండు షిఫ్టులుగా 24/7 విధుల్లో ఉంటూ ఈ తనిఖీ కేంద్రం ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహదేవపూర్ రామారావు, మండల వ్యవసాయ అధికారి సుప్రజ్యోతి, సివిల్ సప్లై విభాగం డీఎం రాములు, కాళేశ్వరం ఎస్సై జి.తమాషారెడ్డి, ఆర్‌ఐ సురేందర్‌రెడ్డి, రఘు, జీపీఓ శ్యామ్ పాల్గొన్నారు.
ఆపరేటర్ల సమస్యలు
పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: మీసేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, నూతన మీ సేవల ఏర్పాట్లను విరమించుకోవాలని తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త కిరణ్‌కుమార్ కోరారు. వాట్సప్ ద్వారా మీసేవ సర్వీసులను రద్దు చేయాలని, నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా మీ సేవల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కమిషన్ విధానమే నేటికీ కొనసాగుతుందని కమిషన్ పెంచాలని కోరారు. కొద్దిపాటి కమిషన్‌తోనే మీ సేవలో నడిపిస్తున్నామని, పెరిగిన ఖర్చులతో ఇబ్బందికరంగా మారిందన్నారు. గతంలో తొలగించిన సర్వీసులు తిరిగి పునరుద్ధరించాలని, జీవనోపాధి భద్రత దృష్ట్యా భరోసా కల్పించే విధంగా ఉత్తర్వులు అందించాలని ఆయన కోరారు.


