హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్
ములుగు రూరల్: హమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలైన ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ తదితర హమాలీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం హమాలీల వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ప్రమాదవశాత్తు బస్తాలు మీద పడి గాయాలపాలై, చనిపోయినా ఎలాంటి రక్షణ లేనందున ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులకు యూనిఫామ్, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘు, చిన్ని, స్వామి, శ్రీధర్, లక్ష్మణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


