మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
● పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు రూరల్: రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరా మహిళా శక్తి సంఘాలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 67లక్షల మంది మహిళా సంఘాల సభ్యులుగా ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కోటి మంది మహిళలు మహిళా సంఘాలలో చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మల్లంపల్లి మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 210 సంఘాలకు రూ. 26 కోట్ల రుణాల చెక్కును అందించారు. మహిళలు కాలంతో పోటీపడడమే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం గరిష్టంగా రూ. 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించి ఆర్థిక, వ్యాపార రంగాలలో ముందుకు తీసుకెళ్తుందని వివరించారు. అనంతరం మండల పరిధిలోని కొడిశలకుంట గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంచ రిషికేశ్ రైస్ మిల్లును మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆత్మ చైర్మన్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


